టిక్‌టాక్‌లో పరిచయమైన యువకులు.. పెళ్లి చేసుకుందాం రమ్మంటే అనంతపురం వెళ్లిన సిద్దిపేట యువతులు!
Advertisement
వీడియో షేరింగ్ యాప్ టిక్‌టాక్‌లో పరిచయమైన అబ్బాయిలు పెళ్లి చేసుకుందాం రమ్మంటే రైలెక్కి వెళ్లిపోయారు ఇద్దరు యువతులు. అక్కడికెళ్లాక యువకులు ప్లేటు ఫిరాయించారు. పెళ్లి చేసుకునేది లేదని తెగేసి చెప్పారు. దీంతో అమ్మాయిలు గ్రామంలోని పెద్దలను ఆశ్రయించారు. అనంతపురం జిల్లా బొమ్మనహాళ్ మండలం దర్గా హొన్నూరులో జరిగిందీ ఘటన. పోలీసుల కథనం ప్రకారం.. సిద్దిపేట జిల్లా గజ్వేల్‌ మండలం మక్తమాసాన్‌పల్లి గ్రామానికి చెందిన ఇద్దరు యువతులు తూప్రాన్‌లో ఓ వాణిజ్య సముదాయంలో పనిచేస్తున్నారు. వీరిద్దరూ అన్నదమ్ముల కుమార్తెలు. వరుసకు అక్కాచెల్లెళ్లు.

టిక్‌టాక్ వీడియో యాప్ ద్వారా అనంతపురం జిల్లా బొమ్మనహాళ్‌ మండలం దర్గాహొన్నూరు గ్రామానికి చెందిన వంశీ, వన్నూరుస్వామిలు వీరికి పరిచయం అయ్యారు. డిగ్రీ చదువుతున్న యువకులు ఇద్దరూ వారిని ప్రేమిస్తున్నట్టు చెప్పారు. పెళ్లి చేసుకుందాం వచ్చేయండంటూ తమ ఊరి అడ్రస్ చెప్పి రూట్‌మ్యాప్ షేర్ చేశారు. దీంతో యువతులు రైలెక్కి గ్రామానికి చేరుకున్నారు.

వారిచ్చిన అడ్రస్ ప్రకారం గ్రామానికి చేరుకున్న యువతులు ఇద్దరూ వారిని కలిసి పెళ్లి చేసుకుందాం పదమన్నారు. దీంతో షాకైన యువకులు తాము పెళ్లి చేసుకోలేమని, వెనక్కి వెళ్లిపోవాలని కోరారు. దీంతో విస్తుపోయిన యువతులు గ్రామ పెద్దలను కలిసి విషయం వివరించారు. అయినప్పటికీ ఫలితం లేకపోవడంతో బొమ్మనహాళ్‌ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు బాధిత యువతులను కళ్యాణదుర్గంలోని ఉజ్వల్‌ హోంకు తరలించారు.
Sat, Nov 09, 2019, 08:09 AM
Advertisement
Advertisement
Copyright © 2019; www.ap7am.com
Privacy Policy | Desktop View