హోటల్‌లో భారీ అగ్నిప్రమాదం...12 మందిని కాపాడిన అగ్నిమాపక సిబ్బంది
Advertisement
మధ్యప్రదేశ్‌ లోని ఇండోర్‌ పట్టణంలోని గోల్డెన్‌ గేట్ హోటల్‌లో సోమవారం భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఐదంతస్తుల హోటల్‌ భవనంలోని మొదటి అంతస్తులో మంటలు మొదలై అనంతరం ఐదు అంతస్తులకు విస్తరించాయి. హోటల్‌ నివాసిత ప్రాంతం మధ్యలో ఉండడంతో చుట్టు పక్కల ఇళ్లవారు తీవ్ర ఆందోళన చెందారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది హుటాహటిన ఘటనా స్థలికి చేరుకుని మంటలు అదుపులోకి తెచ్చే ప్రయత్నం చేస్తున్నారు. హోటల్‌ ముందు భాగంలో మంటలు విజృంభించడంతో వెనుకవైపు ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా లోపల చిక్కుకున్న 12 మంది అతిథులను రక్షించారు.

ముందు జాగ్రత్త చర్యగా హోటల్‌ని ఆనుకుని వున్న ఇళ్లలోని వారిని ఖాళీ చేయించారు. ఆ ప్రాంతంలో విద్యుత్‌ సరఫరా నిలిపివేయించారు. భారీ ప్రమాదమే అయినప్పటికీ ఆ సమయానికి హోటల్‌లో ఎక్కువ మంది అతిథులు లేకపోవడంతో భారీ ప్రాణ నష్టం తప్పిందని భావిస్తున్నారు. ఈ ఘటనలో ఎవరికీ ఏమీ కాలేదని, భారీ ఆస్తి నష్టం జరిగిందని అగ్నిమాపక సిబ్బంది తెలిపారు.
Mon, Oct 21, 2019, 01:05 PM
Advertisement
Advertisement
Copyright © 2019; www.ap7am.com
Privacy Policy | Desktop View