వివాదాస్పదమవుతున్న 'బెడ్ ఫ్రెండ్స్ ఫరెవర్'.. సల్మాన్ ఖాన్ నివాసం వద్ద భారీ భద్రత
Advertisement
ముంబైలోని బాంద్రా ప్రాంతంలో ఉన్న బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ నివాసం వద్ద పోలీసులు కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేశారు. ప్రస్తుతం హిందీలో 'బిగ్ బాస్' సీజన్ 13 కొనసాగుతోంది. అత్యంత ప్రేక్షకాదరణ కలిగిన ఈ రియాల్టీ షోపై విమర్శలు కూడా అదే స్థాయిలో వెల్లువెత్తుతున్నాయి. షోలోని కంటెస్టెంట్ ల మధ్య అసభ్య, అభ్యంతరకర, ఆశ్లీల సన్నివేశాలు ఎక్కువగా ఉంటున్నాయని... కుటుంబసభ్యులు కలిసి చూసేలా షో లేదని పలువురు మండిపడుతున్నారు. ఈ షోపై నిషేధం విధించాలని పలువురు రాజకీయ నాయకులు కూడా డిమాండ్ చేశారు. పలు చోట్ల ఈ షోకు వ్యతిరేకంగా నిరసన కార్యక్రమాలు కూడా జరిగాయి.

భారత సంస్కృతిని దెబ్బతీసేలా బిగ్ బాస్ ఉందంటూ సల్మాన్ నివాసం ఎదుట శుక్రవారంనాడు కర్ణిసేన కార్యకర్తలు నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ క్రమంలో నిరసనకారులను పోలీసులు అదుపులోకి తీసుకుని అక్కడి నుంచి తరలించారు. ఈ నేపథ్యంలోనే, ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా సల్మాన్ నివాసం వద్ద భద్రతను కట్టుదిట్టం చేశారు.

ఈ సందర్భంగా ఓ పోలీసు అధికారి మాట్లాడుతూ, బిగ్ బాస్ కార్యక్రమంలో కొత్తగా ప్రవేశపెట్టిన 'బెడ్ ఫ్రెండ్స్ ఫరెవర్' అనే కాన్సెప్ట్ కు వ్యతిరేకంగా ఆందోళనలు జరుగుతున్నాయని చెప్పారు. ఈ కాన్సెప్ట్ కింద ఆడ, మగ కంటెస్టెంట్లు ఒకే బెడ్ ను షేర్ చేసుకుంటారని... కర్ణిసేనతో పాటు, పలు సంస్థలు దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయని తెలిపారు. ఈ నేపథ్యంలోనే, సల్మాన్ నివాసం వద్ద భద్రతను కట్టుదిట్టం చేశామని... ప్రస్తుతానికైతే పరిస్థితి సాధారణంగానే ఉందని చెప్పారు.
Sun, Oct 13, 2019, 08:48 AM
Advertisement
Advertisement
Copyright © 2019; www.ap7am.com
Privacy Policy | Desktop View