అధికారం శాశ్వతం కాదు...పోలీసులు అది గుర్తించాలి : మాజీ సీఎం చంద్రబాబు
Advertisement
అధికారం ఎప్పుడూ శాశ్వతం కాదని, అది గుర్తించి పోలీసులు చట్టబద్ధంగా వ్యవహరించాలని టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు సూచించారు. చట్టాన్ని చుట్టంగా మార్చుకుని అధికారులు, ప్రజాప్రతినిధులు వ్యవహరిస్తే అదే ఉరితాడై చుట్టుకుంటుందని హెచ్చరించారు. పార్టీ జిల్లా సమీక్షా సమావేశాల్లో పాల్గొనేందుకు ఈరోజు విశాఖ వచ్చిన ఆయన పార్టీ నగర కార్యాలయంలో నాయకులు, కార్యకర్తలతో విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రాష్ట్రంలో కొంతమంది పోలీసుల తీరు అతిగా ఉందన్నారు.

టీడీపీ నేతలు ఇచ్చిన ఫిర్యాదును తీసుకోరని, అదే వైసీపీ నేతలు ఫిర్యాదు చేస్తే రెడ్‌కార్పెట్‌ పరిచి మరీ తీసుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక, ముఖ్యమంత్రి జగన్‌కు ఏ మాత్రం ఆలోచన, చలనశీలత లేదన్నారు. హుద్‌హుద్‌, తిత్లీ వంటి పెను విపత్తుల సమయంలో అప్పటి ముఖ్యమంత్రిగా తాను, పార్టీ నాయకులు బాధితుల మధ్య ఉండి సహాయక చర్యలు చేపట్టిన విషయాన్ని గుర్తు చేశారు.

ఇటీవల గోదావరి, కృష్ణా నదులకు వరదలు వచ్చి ప్రజలు ఇబ్బంది పడుతుంటే ప్రస్తుత ముఖ్యమంత్రి అమెరికా, జెరూసలేం పర్యటనల్లో మునిగి తేలారని విమర్శించారు. ఓటమితో కుంగిపోవాల్సిన అవసరం లేదని, కార్యకర్తలు ధైర్యంగా ఉండాలని పిలుపునిచ్చారు.
Thu, Oct 10, 2019, 01:58 PM
Advertisement
Advertisement
Copyright © 2020; www.ap7am.com
Privacy Policy | Desktop View