వీడని బంధం... భర్తను చితికి తరలించక ముందే భార్య మృతి!
‘ధర్మేచ...అర్ధేచ...కామేచ...మోక్షేచ...’ అంటూ మగాడు తన మెడలో తాళికట్టిన మరుక్షణం నుంచి అతనే జీవితంగా ప్రయాణం కొనసాగిస్తుంది భార్య. జీవిత ప్రయాణంలోనే కాదు, మరణంలో సైతం నీతోపాటే అనుకుందో ఏమో ఆమె భర్త మృతదేహం వద్ద విలపిస్తూ అలాగే కన్నుమూసింది. కుటుంబ సభ్యులకు తీవ్ర విషాదాన్ని మిగిల్చింది.

వివరాల్లోకి వెళితే... విజయనగరం జిల్లా గుర్ల మండలం పెనుబర్తి గ్రామానికి చెందిన ముల్లు నరసింహులు (75), గురవమ్మ దంపతులు. నరసింహులు ఈరోజు ఉదయం కన్నుమూశాడు. దీంతో కుటుంబ సభ్యులు అంతిమ సంస్కారానికి అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నారు. భర్త మృతితో షాక్‌కు గురైన గురవమ్మ ఆయన తలవద్ద కూర్చుని ఏడుస్తోంది. అలా ఏడుస్తూనే కాసేపటికి తలవాల్చేసింది. భర్తపై తల ఆన్చి వెక్కివెక్కి ఏడుస్తోందని అంతా భావించారు.

కానీ అమె ఎప్పటికీ లేవకపోవడంతో అంతిమ సంస్కారం ఏర్పాట్లు చేస్తున్న వారు లేపే ప్రయత్నం చేయగా ఆమె లేవలేదు. ఆమె చనిపోయినట్టు గుర్తించి ఆశ్చర్యపోయారు. ఈ హఠాత్పరిణామంతో కుటుంబ సభ్యులు, అక్కడివారు ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు. ఈ ఘటన గ్రామస్తులను కూడా కంటతడి పెట్టించింది.
Thu, Oct 10, 2019, 10:54 AM
Advertisement
Advertisement
Copyright © 2020; www.ap7am.com
Privacy Policy | Desktop View