తల్లిపై చేయి చేసుకున్న అన్న...ఆగ్రహం తట్టుకోలేక అతన్ని హత్య చేసిన తమ్ముడు
తల్లిని తరచూ వేధించడమేకాక మద్యం మత్తులో ఆమెపై చేయిచేసుకోవడాన్ని భరించలేక పోయిన తమ్ముడు అన్నతో గొడవ పడడమేకాక ఆగ్రహంలో అతన్ని చంపేశాడు. పోలీసుల కథనం మేరకు...సికింద్రాబాద్‌ రెజిమెంటల్‌ బజార్‌కు చెందిన యాదమ్మకు గ్యాస్‌కట్టర్‌గా పనిచేసే సంతోష్‌కుమార్‌, పూలడెకరేషన్‌ చేసే సాయికుమార్‌ కొడుకులు. ఈమెకు ఓ కూతురు కూడా ఉంది. అన్నదమ్ములు ఇద్దరికీ వివాహం జరగగా తల్లితోనే కలిసి ఉంటున్నారు. మద్యానికి బానిసైన సంతోష్‌కుమార్‌ (32) భార్యను, తల్లిని తరచూ వేధిస్తుండే వాడు. ఇతని వేధింపులు భరించలేక భార్య పుట్టింటికి వెళ్లిపోయింది.

ఈ నేపథ్యంలో దసరా రోజు అర్ధరాత్రి అన్నదమ్ములు ఇద్దరూ మద్యం మత్తులో ఉన్నారు. ఆ సమయంలో జ్వరం కారణంగా మూడో అంతస్తులో నిద్రిస్తున్న తల్లి వద్దకు సంతోష్‌కుమార్‌ వెళ్లి ఆమెతో గొడవపడ్డాడు. కోపంతో ఆమెపై చేయిచేసుకున్నాడు. ఆమె కేకలు విని సాయికుమార్‌ తల్లి ఉన్న గదిలోకి వెళ్లాడు. తల్లిని కొడుతుండడంపై అన్నను నిలదీశాడు. ఈ సందర్భంగా ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది.

ఈ సమయంలో సంతోష్‌ పూలను కత్తిరించే బ్లేడుతో తమ్ముడిపై దాడి చేసి గాయపరిచాడు. దీంతో అదే బ్లేడు లాక్కుని సాయికుమార్‌ అన్నపై దాడిచేసి గాయపరిచాడు. తీవ్రంగా గాయపడిన పెద్ద కొడుకును స్థానికుల సహాయంతో తల్లి సమీపంలోని ఆసుపత్రికి తరలించగా అక్కడ చికిత్స పొందుతూ చనిపోయాడు. పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకుని మృతుని భార్యకు సమాచారం అందించారు.
Thu, Oct 10, 2019, 10:30 AM
Advertisement
Advertisement
Copyright © 2019; www.ap7am.com
Privacy Policy | Desktop View