పాతికేళ్లలో తొలిసారి ఇలా... రెండు నెలల్లో ఐదోసారి తెరచుకున్న కృష్ణమ్మ గేట్లు!
Advertisement
రెండు నెలల వ్యవధిలో 30 రోజులకు పైగా శ్రీశైలం రిజర్వాయర్ క్రస్ట్ గేట్ల నుంచి నీటిని వదిలారు. ఈ 60 రోజుల్లో నాలుగు సార్లు కృష్ణమ్మ పరుగులను చూసిన ప్రజలు, మరోసారి జలదృశ్యాన్ని కళ్లారా చూస్తున్నారు. ఎగువ నుంచి వస్తున్న వరద పెరగడంతో నిన్న సాయంత్రం జలాశయం గేట్లను అధికారులు తెరిచారు.

తుంగభద్ర నుంచి 80 వేల క్యూసెక్కులకు పైగా వరద వస్తోందని, డ్యామ్ లో నీటిని మరింతగా నిల్వచేసే సామర్థ్యం లేకపోవడంతో ఆ మొత్తం నీటిని దిగువకు వదులుతున్నామని అధికారులు తెలిపారు.

ఇక, ఓ సీజన్ లో ఇన్నిసార్లు డ్యామ్ గేట్లు ఎత్తడం గత పాతికేళ్లలో ఇదే తొలిసారని అధికారులు వ్యాఖ్యానించారు. ఆగస్టు 9న, సెప్టెంబర్ లో 10న, 20న, 26న, ఈ నెల 9న అధికారులు గేట్లను తెరిచారు. శ్రీశైలం పూర్తి నీటిమట్టం 885 అడుగులు కాగా, ప్రస్తుతం 884.9 అడుగుల మేరకు నీరు నిల్వ ఉంది. ఈ సీజన్ లో 1,340 టీఎంసీల నీరు శ్రీశైలం జలాశయానికి రాగా, 1,010 టీఎంసీల నీటిని దిగువకు వదిలామని అధికారులు తెలిపారు.

1994 తరువాత స్పిల్ వే ద్వారా ఇన్ని టీఎంసీల నీటిని వదలడం ఇదే తొలిసారని అధికారులు అంటున్నారు. మరోవైపు 2009 తరువాత నాగార్జున సాగర్ జలాశయం 26 గేట్లనూ ఈ సీజన్ లో ఎత్తాల్సి వచ్చింది. సాగర్ జలాశయం సైతం నిండుకుండలా ఉండటం, ఎగువ నుంచి 50 వేలకు పైగా క్యూసెక్కుల నీరు వస్తుండటంతో, నేడు గేట్లను ఎత్తవచ్చని అంచనా.
Thu, Oct 10, 2019, 06:50 AM
Advertisement
Advertisement
Copyright © 2020; www.ap7am.com
Privacy Policy | Desktop View