టీటీడీ ఛైర్మన్ గా వుండి, ఈ పంచాయితీలేమిటి?: వైవీ సుబ్బారెడ్డిపై వర్ల రామయ్య ఫైర్
Advertisement
నెల్లూరు జిల్లా ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, కాకాణి గోవర్ధన్ రెడ్డి మధ్య నెలకొన్న విభేదాలను పరిష్కరించే నిమిత్తం టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి నివాసంలో ఈరోజు సమావేశం జరిగిన విషయం తెలిసిందే. ఈ విషయమై టీడీపీ నేత వర్ల రామయ్య విమర్శలు గుప్పించడంతో పాటు ఆగ్రహం వ్యక్తం చేశారు.

టీటీడీ ఛైర్మన్ హోదాలో ఉన్న వైవీ సుబ్బారెడ్డి తన నివాసంలో నెల్లూరు పంచాయితీ ఎలా నిర్వహిస్తారు? ఆలయ ఛైర్మన్ గా ఉన్న వ్యక్తికి రాజకీయ పంచాయితీలు అవసరమా? అంటూ ప్రశ్నల వర్షం కురిపించారు. ఎంపీడీవో సరళ ఇంటిపై దాడికి పాల్పడ్డారన్న ఆరోపణలు ఎదుర్కొంటున్న కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి విషయంలో ప్రభుత్వం వ్యవహరించిన తీరు సరిగా లేదని అన్నారు. ప్రభుత్వం కనుక సరిగా వ్యవహరించి ఉంటే కోటంరెడ్డి ఈరోజు జైల్లో ఉండాలని వ్యాఖ్యానించారు.

సీఎం జగన్ కు నైతిక విలువలు ఉంటే కోటంరెడ్డిని జ్యుడిషియల్ కస్టడీకి పంపాలని డిమాండ్ చేశారు. సీఎం జగన్ కుటుంబసభ్యులపై అభ్యంతరకర పోస్టింగ్స్ చేస్తున్నారంటూ టీడీపీ నాయకులపై వస్తున్న ఆరోపణలను ఆయన తిప్పి కొట్టారు. ఈ విషయమై చర్చకు సిద్ధమా? అని వైసీపీ నేతలకు సవాల్ విసిరారు. దీనిపై చర్చకు సీఎం వస్తే చంద్రబాబు సిద్ధం అని, లేనిపక్షంలో వైసీపీ నాయకులు వస్తే తమ నాయకులు సిద్ధంగా ఉన్నారని చెప్పారు.
Wed, Oct 09, 2019, 09:36 PM
Advertisement
Advertisement
Copyright © 2019; www.ap7am.com
Privacy Policy | Desktop View