ఢిల్లీలో సొంత క్వార్టర్ లేని కేంద్రమంత్రి కిషన్‌ రెడ్డి.. ఆంధ్రా భవన్‌ నుంచే విధుల నిర్వహణ!
Advertisement
ఆయన కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి. కీలకమైన మంత్రిత్వ శాఖ బాధ్యతలు నిర్వహిస్తున్నా ఢిల్లీలో ఆయనకు ఉండడానికి ఇల్లు లేదు. అధికారిక భవనంలో ఇప్పటికే ఆయన దిగాల్సి ఉన్నా ఇప్పటికీ ఆయన  ఢిల్లీలోని ఆంధ్రా భవన్‌ నుంచే విధులు నిర్వహిస్తుండడం గమనార్హం. తెలంగాణ బీజేపీ సీనియర్‌ నేత, కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి పరిస్థితి ఇది. మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన కొన్ని రోజులకు ఆయనకు ప్రభుత్వం క్వార్టర్ కేటాయించినప్పటికీ అందులో తిష్టవేసి ఉన్న మాజీలు ఖాళీ చేయక పోవడంతో అనధికార నివాసంలో నెట్టుకురాక తప్పడం లేదు.

కిషన్‌ రెడ్డికి తుగ్లక్‌ క్రెస్కెంట్‌ రోడ్డులో భవనాన్ని కేటాయించారు. ప్రస్తుతం అందులో మాజీ మంత్రి జయంత్‌ సిన్హా ఉంటున్నారు. వాస్తవానికి జయంత్‌ సిన్హాకు బీజేపీ పాత ప్రధాన కార్యాయం ఎదురుగా ఉన్న బంగ్లాను కేటాయించారు. అందులో బీజేపీ సీనియర్‌ నేత రాధామోహన్‌సింగ్‌ ఉంటున్నారు. సింగ్‌ తన భవనం ఖాళీ చేయక పోవడంతో జయంత్‌ సిన్హా కూడా తానుంటున్న ఇల్లు ఖాళీ చేయడం లేదు.

దీంతో కిషన్‌రెడ్డికి అధికారిక నివాసం కేటాయించినా అందులోకి వెళ్లే అవకాశం ఇప్పటి వరకు రాలేదు. వాస్తవానికి 16వ లోక్‌సభ మే 25 నాటికి రద్దయింది. నిబంధనల ప్రకారం జూన్‌ 25 నాటికి ఎంపీలంతా వారి అధికారిక భవనాలు ఖాళీ చేయాలి. కానీ నాలుగు నెలలు కావస్తున్నా మాజీలు ఇళ్లు ఖాళీ చేయడం లేదు.

మాజీలంతా తమ అధికారిక నివాసాలు వారం రోజుల్లోగా ఖాళీ చేయాలని గతనెలలో అధికారులు గట్టిగా చెప్పినప్పటికీ ఎవరూ పట్టించుకోలేదు. దీంతో ఆయా బంగ్లాల్లోకి నీరు, విద్యుత్‌ సరఫరా ఆపేయాలని ప్రభుత్వం అధికారులకు సూచించింది.
Fri, Sep 20, 2019, 12:26 PM
Advertisement
Advertisement
Copyright © 2019; www.ap7am.com
Privacy Policy | Desktop View