ప్రజా సమస్యలపై వైసీపీ ప్రభుత్వానికి ధ్యాస లేదు: జగన్ 'వందరోజుల పాలన'పై సుజనా చౌదరి విమర్శలు
Advertisement
ఏపీలో వైసీపీ ప్రభుత్వం వందరోజుల పాలనపై బీజేపీ ఎంపీ సుజనా చౌదరి విమర్శలు చేశారు. విజయవాడలో ఈరోజు ఆయన మాట్లాడుతూ, ప్రజా సమస్యలపై వైసీపీ ప్రభుత్వానికి ధ్యాస లేదని విమర్శించారు. ఈ సందర్భంగా పోలవరం ప్రాజెక్టు గురించి ఆయన ప్రస్తావించారు. పోలవరం ప్రాజెక్టు పూర్తయితే కుడి కాలువ ద్వారా 80 టీఎంసీలు కృష్ణా నదికి వస్తాయని, ఎడమ కాలువ ద్వారా తూర్పు గోదావరి జిల్లాకు నీళ్లు వెళ్తాయని చెప్పారు.

ఎవరైనా అవినీతి చేస్తే వ్యక్తిగతంగా శిక్షించాలే తప్ప, అన్ని ప్రాజెక్టుల నిర్మాణలను రద్దు చేయడం మంచిది కాదని సూచించారు. కేంద్రం వద్దని చెబుతున్నా రీటెండరింగ్ కు వెళ్లడం సబబు కాదని, రీటెండర్ల ద్వారా రూ.500 కోట్లు మిగులిస్తామంటున్నారు కానీ రూ.5 కూడా తగ్గించలేరని అభిప్రాయపడ్డారు. కాఫర్ డ్యామ్ పూర్తి చేసుంటే గ్రావిటీ ద్వారా నీళ్లు ఇవ్వొచ్చని, ప్రభుత్వం ఏమాత్రం ఆలోచన లేకుండా వ్యవహరిస్తోందని, ఇప్పటికైనా ప్రభుత్వం విజ్ఞతతో వ్యవహరించాలని సూచించారు.

‘పోలవరం’ జీవనాడి అని డెబ్బై ఏళ్ల నుంచి చెప్పుకుంటూ వస్తున్నామని, స్వాతంత్ర్యం రాకముందు నుంచే ఈ ప్రాజెక్టుకు ప్రణాళిక రచించారని గుర్తు చేశారు. 1981లో అప్పటి సీఎం ఈ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేశారని, వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో దీన్ని మొదలుపెట్టారని చెప్పారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలోనే పోలవరం ప్రాజెక్టుకు సంబంధించిన టెండర్ విధానంలో తప్పు జరిగిందని, 14 శాతం తక్కువకు కాంట్రాక్టు ఇచ్చారని విమర్శించారు.  
Wed, Sep 11, 2019, 03:54 PM
Advertisement
Advertisement
Copyright © 2020; www.ap7am.com
Privacy Policy | Desktop View