కొలనులో పూడిక తీస్తుండగా చోళుల కాలం నాటి రాగి నాణేలు లభ్యం
Advertisement
తమిళనాడు ప్రాంతాన్ని క్రీస్తు శకం 9-13 శతాబ్దాల మధ్య కాలంలో పరిపాలించిన బలమైన చోళరాజుల కాలం నాటి రాగి నాణేలు బయటపడ్డాయి. తమిళనాడు రాష్ట్రం అరియూర్‌ జిల్లా ఆండి మఠానికి చెందిన నందదేవన్‌ కొలనులో పూడిక తొలగింపునకు  చేపట్టిన తవ్వకాల్లో ఈ నాణేలు బయటపడడం గమనార్హం. దాదాపు మూడు శతాబ్దాలపాటు కావేరీ పరీవాహక ప్రాంతాతోపాటు తుంగభద్ర నది వరకు ఉన్న విశాలమైన ప్రాంతంలో బలమైన  రాజ్యాన్ని స్థాపించి సుదీర్ఘకాలం రాజ్యమేలిన వారిగా గుర్తింపు పొందారు చోళ రాజులు. వారి కాలంలో ముద్రించిన రాగి నాణేలుగా వీటిని గుర్తించారు.

దేవాలయానికి చెందిన కొలను ఒకటి అగరం గ్రామంలో ఉంది. ఈ కొలనుపై ఆధారపడి చుట్టుపక్కల గ్రామాల ప్రజలు జీవనోపాధి పొందుతున్నారు. అటువంటి కొలనులో పూడిక పేరుకు పోవడంతో బాగు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. అధికారుల ఆధ్వర్యంలో పూడిక తీత పనులు జరుగుతుండగా కొలనులో ఓ బిందె లభించింది. దాన్ని గుర్తించిన సిబ్బంది గ్రామ నిర్వాహక అధికారులకు సమాచారం అందించారు.

దీంతో వారు కుండను వెలికి తీసి చూడగా వందల సంఖ్యలో రాగి నాణేలు బయటపడ్డాయి.  వాటిని వారు తహసీల్దార్‌ కుమరన్‌కు అప్పగించారు. ఆయన సమాచారం మేరకు వచ్చిన పురావస్తు శాఖ అధికారులు నాణేలను పరిశీలించి అవి చోళుల కాలం నాటివని గుర్తించారు.
Wed, Sep 11, 2019, 12:31 PM
Advertisement
Advertisement
Copyright © 2019; www.ap7am.com
Privacy Policy | Desktop View