ఇంటి వద్దకు రాగానే చింతమనేని అరెస్ట్!
Advertisement
గత కొంతకాలంగా అజ్ఞాతంలో ఉన్న దెందులూరు మాజీ ఎమ్మెల్యే, తెలుగుదేశం పార్టీ నేత చింతమనేని ప్రభాకర్ ను పోలీసులు కొద్దిసేపటి క్రితం అరెస్ట్ చేశారు. తాను నేడు పోలీసుల ముందుకు వస్తానని, తనను అరెస్ట్ చేసుకోవచ్చని చింతమనేని ఓ ప్రకటన ద్వారా పేర్కొన్న సంగతి తెలిసిందే. చెప్పినట్టుగానే, దుగ్గిరాలలోని తన నివాసానికి ఆయన అనుచరులతో సహా వచ్చారు.

అప్పటికే అక్కడ మకాం వేసిన పోలీసులు, ఆయన్ను అరెస్ట్ చేస్తున్నట్టు ప్రకటించారు. అనారోగ్యంతో ఉన్న తన భార్యను కలిసేందుకు తాను వచ్చానని, కానీ పోలీసులు ఏ విధమైన విచారణ చేపట్టకుండానే అరెస్ట్ చేశారని ఈ సందర్భంగా చింతమనేని విమర్శించారు. తనపై జరుగుతున్న రాజకీయ కుట్రలో భాగంగానే కేసుల్లో ఇరికించారని, న్యాయ పోరాటంలో తానే గెలుస్తానని అన్నారు. తానే స్వయంగా పోలీసుల ముందుకు వస్తానని చెప్పినప్పటికీ, ఇంత హై డ్రామా ఏంటని ప్రశ్నించారు.

పోలీసుల వాహనాలు ముందుకు కదలకుండా ఆయన అనుచరులు అడ్డుకోగా, పోలీసులు వారిని చెదరగొట్టారు. కాగా, చింతమనేనిని స్టేషన్ కు తీసుకెళ్లి విచారిస్తారా? లేక నేరుగా న్యాయమూర్తి వద్దకు తీసుకెళ్తారా? అన్న విషయమై స్పష్టత లేదు.
Wed, Sep 11, 2019, 11:59 AM
Advertisement
Advertisement
Copyright © 2020; www.ap7am.com
Privacy Policy | Desktop View