గానకోకిలకు మరో గౌరవం.. లతా మంగేష్కర్ కు ‘డాటర్ ఆఫ్ ది నేషన్’ బిరుదుతో సత్కారం!
Advertisement
దిగ్గజ గాయని, పద్మవిభూషణ్ లతా మంగేష్కర్ కు మరో గౌరవం దక్కింది. తన తియ్యటి స్వరంతో 70 ఏళ్ల పాటు భారతావనిని అలరించిన లతా మంగేష్కర్ ను ‘డాటర్ ఆఫ్ ది నేషన్’ బిరుదుతో సత్కరించాలని కేంద్రం నిర్ణయించింది. ఈ నెల 28న లతా మంగేష్కర్ 90వ పుట్టిన రోజును జరుపుకోనున్నారు. ఈ నేపథ్యంలో అదే రోజున లతా మంగేష్కర్ కు ఈ బిరుదును ప్రదానం చేయాలని కేంద్రం నిర్ణయించింది. 1929లో ఇండోర్(ప్రస్తుత మధ్యప్రదేశ్)లో లతా మంగేష్కర్ జన్మించారు.

1942లో గాయనిగా కెరీర్ ప్రారంభించిన ఆమె 1000కిపైగా బాలీవుడ్ సినిమాల్లో 25,000 పాటలను ఆలపించారు. అంతేకాకుండా దేశ,విదేశాలకు చెందిన 36 భాషల్లో లతా మంగేష్కర్ పాటలు పాడారు. సినీరంగానికి ఆమె అందించిన సేవలకు గానూ కేంద్ర ప్రభుత్వం 1989లో దాదా సాహెబ్ ఫాల్కే అవార్డును అందించింది. 2001లో దేశ అత్యున్నత పౌర పురస్కారం భారతరత్నను ఆమె అందుకున్నారు. 2007లో ఫ్రాన్స్ తమ అత్యున్నత పౌర పురస్కారం ఆఫీస్ ఆఫ్ లీజియన్ ఆనర్ తో లతాను గౌరవించింది. పద్మభూషణ్, పద్మవిభూషణ్ లతో పాటు ఫిల్మ్ ఫేర్, పలు సినీ అవార్డులు లతాజీని వరించాయి. రాయల్ అల్బర్ట్ హాల్ లో ప్రదర్శన ఇచ్చిన తొలి భారతీయురాలిగా లతా మంగేష్కర్ చరిత్ర సృష్టించారు. అన్నట్లు భారత ప్రధాని నరేంద్ర మోదీ లతా మంగేష్కర్ కు వీరాభిమాని అట.
Sun, Sep 08, 2019, 12:26 PM
Advertisement
Advertisement
Copyright © 2019; www.ap7am.com
Privacy Policy | Desktop View