గూగుల్ ఉద్యోగులు ఆఫీసులో చేయకూడని పనులు ఇవే!
Advertisement
ప్రముఖ సెర్చింజన్ దిగ్గజం గూగుల్ కు ప్రపంచవ్యాప్తంగా అనేక కార్యాలయాలున్నాయి. కొన్ని వేలమంది ఉద్యోగులు గూగుల్ ఆఫీసుల్లో పనిచేస్తున్నారు. తాజాగా తన ఉద్యోగులకు గూగుల్ సరికొత్త నియమావళి తీసుకువచ్చింది. దాని ప్రకారం, విధి నిర్వహణ సమయంలో ఏ ఉద్యోగి కూడా రాజకీయాల గురించి మాట్లాడడం కానీ, ఓ వార్తా కథనం గురించి సహోద్యోగులతో చర్చించడం కానీ చేయకూడదు. ట్రోల్ చేయడం, ఇతరులను ఉద్దేశించి పేరు పెట్టి వ్యాఖ్యలు చేయడం, సహోద్యోగులను, గూగుల్ భాగస్వాములను, గూగుల్ అనుబంధ సంస్థల సిబ్బందిని వ్యక్తి పేరిట లేదా గ్రూప్ పేరిట అవమానించడం, బెదిరించడం చేయరాదని గూగుల్ తన అధికారిక బ్లాగ్ లో పేర్కొంది.

గూగుల్ ఉత్పత్తుల గురించి తప్పుదారి పట్టించే ప్రకటనలు ఇవ్వడం, సంస్థ గురించిన సమాచారాన్ని ఇతరులతో పంచుకోవడం వంటి చర్యలకు దూరంగా ఉండాలని గూగుల్ తన నియమావళిలో స్పష్టం చేసింది. ఉద్యోగులు పూర్తి బాధ్యతతో వ్యవహరించాలని, ఉద్యోగులు తమ మాటలకు, చేష్టలకు వారే బాధ్యత వహించాల్సి ఉంటుందని ఉద్ఘాటించింది. గూగుల్ లో పనిచేయడం అనేది అపారమైన బాధ్యతతో కూడుకున్న పని అని, అత్యంత నాణ్యమైన, విశ్వసనీయమైన సమాచారం కోసం నిత్యం వందల కోట్ల మంది గూగుల్ పై ఆధారపడుతున్నారని, ఆ నమ్మకాన్ని నిలబెట్టుకోవడం అత్యంత క్లిష్టమైన వ్యవహారం అని గూగుల్ తన బ్లాగ్ లో వివరించింది.
Sat, Aug 24, 2019, 06:39 PM
Advertisement
Advertisement
Copyright © 2019; www.ap7am.com
Privacy Policy | Desktop View