‘అహాన్ని పారద్రోలడం'పై పుస్తకం చదువుతున్న విరాట్ కోహ్లీ
Advertisement
టీమిండియా సారథి విరాట్ కోహ్లీ ఎంత దూకుడుగా ఉంటాడో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. అతడి దుందుడుకు స్వభావంపై అప్పట్లో బోల్డన్ని విమర్శలు కూడా వచ్చాయి. అయితే, అతడు సాధించే విజయాల ముందు అవన్నీ కొట్టుకుపోయాయి. అయితే, ఆ తర్వాత అతడిపై విమర్శలకు అది మరోమారు కారణమైంది. అనిల్ కుంబ్లే వ్యవహారంలో కోహ్లీ వ్యవహరించిన తీరుపై సర్వత్ర విమర్శలు వెల్లువెత్తాయి.

కోహ్లీ అహంకారపూరితంగా వ్యవహరించడంతో టీమిండియా కోచ్ పదవికి అనిల్ కుంబ్లే రాజీనామా చేశాడు. కుంబ్లే లాంటి వాడు రాజీనామా చేయాల్సిన పరిస్థితిని కల్పించాడంటే కోహ్లీ ఎంత అహంభావంగా ప్రవర్తించి ఉండొచ్చో అర్థం చేసుకోవచ్చంటూ అతడిపై ముప్పేట దాడి మొదలైంది. అవేమీ పట్టించుకోని కోహ్లీ తనకిష్టమైన రవిశాస్త్రిని కోచ్‌గా నియమించుకుని పంతం నెగ్గించుకున్నాడు.

అయితే, తాజాగా కోహ్లీ ఓ పుస్తకం చదువుతున్న ఫొటో ఒకటి బయటకు వచ్చింది. విండీస్‌తో అంటిగ్వాలో తొలి టెస్టు జరుగుతోంది. ఈ సందర్భంగా శుక్రవారం డ్రెస్సింగ్ రూములో కోహ్లీ ‘డిటాక్స్ యువర్ ఇగో: 7 ఈజీ స్టెప్స్ టు అచీవింగ్ ఫ్రీడం, హ్యాపీనెస్ అండ్ సక్సెస్ ఇన్ యువర్ లైఫ్’ (మీలోని అహాన్ని పారద్రోలండి: జీవితంలో స్వేచ్ఛ, సంతోషం, విజయాన్ని సొంతం చేసుకునేందుకు ఏడు మార్గాలు) అనే పుస్తకాన్ని చదువుతూ కనిపించాడు.

ఈ ఫొటో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. తనలోని అహాన్ని తగ్గించుకోవాలంటే ఈ పుస్తకం చదవాలని ఎవరో సలహా ఇచ్చి ఉంటారని,  అందుకే చదువుతున్నాడని నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. కోహ్లీ ఆ  పుస్తకం చదవడం చూస్తుంటే ఆశ్చర్యంగా ఉందని మరో యూజర్ రాసుకొచ్చాడు. ఏది ఏమైనా కోహ్లీ ఆ పుస్తకం చదవడం మాత్రం సంతోషించదగ్గ పరిణామమని అంటున్నారు.
Sat, Aug 24, 2019, 09:50 AM
ఈ వార్తను గ్రూప్ లో షేర్ చేయండి
Do you hate Fake News, Misleading Titles, Cooked up Stories and Cheap Analyses?... We are here for YOU: Team ap7am.com
Advertisement
Copyright © 2020; www.ap7am.com
Privacy Policy | Desktop View