కశ్మీర్‌ను అస్థిరపరిచేందుకు పాక్ ఉగ్రవాదాన్ని ఎగదోస్తోంది: పీఓకే నేత మండిపాటు
Advertisement
కశ్మీర్ విషయంలో అంతర్జాతీయ సాయం కోరి భంగపడిన పాకిస్థాన్‌కు ఆ దేశ ప్రజల నుంచే వ్యతిరేకత వ్యక్తమవుతోంది. జమ్మూ కశ్మీర్‌లో గందరగోళం సృష్టించేందుకు పాక్ ప్రభుత్వం దశాబ్దాలుగా ఉగ్రవాదాన్ని ఎగదోస్తోందని పాక్ ఆక్రమిత కశ్మీర్‌లోని జమ్మూ కశ్మీర్ లిబరేషన్ ఫ్రంట్ (జేకేఎల్ఎఫ్) నేత సర్దార్ సాఘిర్ ఆరోపించారు. కశ్మీర్‌ను అస్థిరపరిచేందుకు పాక్ ఉగ్రవాదులను ప్రయోగిస్తోందని అన్నారు.

దేశీయంగా వచ్చిన కశ్మీర్ ఉద్యమాన్ని చెడగొట్టేందుకు 1947లో పస్థూన్ గిరిజనులను ఆ ప్రాంతానికి పాక్ పంపించిందని పేర్కొన్నారు. 1980లో జమ్మూ కశ్మీర్ ప్రజలు మరో ఉద్యమాన్ని తీసుకొస్తే 1989లో పాకిస్థాన్ దానిని హైజాక్ చేసిందని చెప్పుకొచ్చారు. ఇందుకోసం హిజ్బుల్ ముజాహిదీన్, జమాతుల్ ముజాహిదీన్ వంటి ఉగ్రవాద సంస్థలను వాడుకుందని సర్దార్ ఆరోపించారు. ఆ తర్వాత అంతర్జాతీయ ఉగ్రవాది హఫీజ్ సయీద్‌కు చెందిన లష్కరే తాయిబా, జమాత్ ఉద్ దవాలు కూడా కశ్మీర్‌లోకి ప్రవేశించాయన్నారు. పాక్ ఆక్రమిత కశ్మీర్‌లో చాలా దారుణాలు జరుగుతున్నాయని సర్దార్ సాఘిర్ ఆవేదన వ్యక్తం చేశారు.
Sat, Aug 24, 2019, 09:32 AM
Advertisement
Advertisement
Copyright © 2019; www.ap7am.com
Privacy Policy | Desktop View