అంబటి రాయుడు మనసు మార్చుకున్నాడా..?
Advertisement
వరల్డ్ కప్ ఆడే భారత జట్టులో తనకు స్థానం లభించకపోవడంతో క్రికెట్ కు వీడ్కోలు పలికి అందరినీ నిర్ఘాంతపోయేలా చేసిన అంబటి రాయుడు ఇప్పుడు మనసు మార్చుకున్నట్టు తెలుస్తోంది. తన రిటైర్మెంటు నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని నిర్ణయించుకున్నట్టు సమాచారం. రాయుడు తాజా వ్యాఖ్యలు చూస్తే అది నిజమే అనిపిస్తోంది.

ప్రస్తుతం టీఎన్ సీఏ లీగ్ పోటీల్లో ఆడుతున్న రాయుడు గ్రాండ్ స్లామ్ జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. మ్యాచ్ అనంతరం మాట్లాడుతూ, మున్ముందు టీమిండియా తరఫున టి20, వన్డేల్లో ఆడాలని భావిస్తున్నట్టు వెల్లడించాడు. అంతేకాదు, కాసుల వర్షం కురిపించే ఐపీఎల్ లోనూ ఆడాలనుందని మనసులో మాట బయటపెట్టాడు.

కిందటి నెలలోనే అంతర్జాతీయ క్రికెట్ నుంచి తప్పుకుంటున్నట్టు రాయుడు ప్రకటించాడు. వరల్డ్ కప్ కు ఎంపిక చేయకపోవడంతో పాటు, మధ్యలో ఆటగాళ్లు గాయపడితే తనను రిజర్వ్ ప్లేయర్ కోటాలో అయినా తీసుకోకపోవడం రాయుడ్ని బాధించింది. దాంతో అన్ని ఫార్మాట్ల నుంచి రిటైర్ అవుతున్నట్టు ఆవేశంగా ప్రకటించి సంచలనం సృష్టించాడు. మరి రాయుడు మళ్లీ ఆడాలన్న తాజా నిర్ణయాన్ని టీమిండియా సెలెక్టర్లు పరిగణనలోకి తీసుకుంటారో? లేదో? వేచి చూడాలి.
Fri, Aug 23, 2019, 08:46 PM
Advertisement
Advertisement
Copyright © 2020; www.ap7am.com
Privacy Policy | Desktop View