కోడలి తీరుతో మనస్తాపం.. కొడుకుతో పాటు అత్తమామల ఆత్మహత్య
కోడలి తీరుతో మనస్తాపానికి గురైన ఆమె భర్త, అత్తమామలు ఆత్మహత్యకు పాల్పడిన ఘటన ఇది. పోలీసుల కథనం మేరకు...కృష్ణా జిల్లా కైకలూరు మండలం తామరకొల్లు పంచాయతీ అయోధ్య పట్టణానికి చెందిన వెలగ బల రామకృష్ణారెడ్డి (60), సుబ్బలక్ష్మి (51) దంపతుల కొడుకు గంగాధరరెడ్డి (30). ఇతనికి ఇద్దరు సోదరిలు. సింగపూర్‌లో ఉద్యోగం చేస్తున్న గంగాధర్‌రెడ్డికి పశ్చిమగోదావరి జిల్లా ఏలేటిపాడుకు చెందిన రాజేశ్వరితో గత ఏడాది పెళ్లయింది. పెళ్లి జరిగిన కొన్ని రోజుల తర్వాత భార్యను తల్లిదండ్రుల వద్ద వదిలి గంగాధర్‌రెడ్డి సింగపూర్‌ వెళ్లిపోయాడు. భర్త విదేశాలకు వెళ్లిన వెంటనే రాజేశ్వరి తన పుట్టింటికి వెళ్లిపోయింది.

ఈ నేపథ్యంలో పెళ్లి రోజుకని ఇటీవల గంగాధర్‌రెడ్డి స్వదేశానికి వచ్చాడు. భర్త రాకతో రాజేశ్వరి కూడా అత్తవారింటికి వచ్చింది. ఈ సందర్భంలో దంపతుల మధ్య గొడవలు మొదలయ్యాయి. దీంతో అలిగిన రాజేశ్వరి తిరిగి పుట్టింటికి వెళ్లిపోయింది. అత్తమామలు ఆమె పుట్టింటికి వెళ్లి నచ్చచెప్పి తెచ్చేందుకు చేసిన ప్రయత్నం ఫలించలేదు. రాజేశ్వరి తీరుతో గంగాధరరెడ్డితోపాటు అతని తల్లిదండ్రులు కూడా తీవ్రమనస్తాపానికి గురయ్యారు. చేపల చెరువుల్లో వాడే పురుగుల మందును తాగి ఆత్మహత్య చేసుకున్నారు.

కాగా, గురువారం మధ్యాహ్నం గంగాధర్‌రెడ్డి, అతని తల్లిదండ్రులను ఇంట్లో చూసిన స్థానికులు సాయంత్రం ఐదు గంటలైనా జాడలేక పోవడంతో అనుమానం వచ్చి మూసివున్న తలుపులు తోసుకుని లోపలికి వెళ్లి చూడగా ముగ్గురూ చనిపోయి ఉన్నారు. దీంతో షాక్‌కు గురైన వారు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు.

పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని మృతదేహాల వద్ద ఓ లేఖను స్వాధీనం చేసుకున్నారు. రాజేశ్వరితో ఉన్న కలహాల వల్లే తాము ఆత్మహత్య చేసుకుంటున్నామని, తమ ఆస్తి యావత్తు కుమార్తెలకే చెందాలని లేఖలో రాసి ఉండడంతో పోలీసులు ఆ మేరకు కేసు నమోదు చేశారు.
Fri, Aug 23, 2019, 10:38 AM
Advertisement
Advertisement
Copyright © 2020; www.ap7am.com
Privacy Policy | Desktop View