స్నేహితుడితో మాట్లాడేందుకు వెళ్లిన ఇంజినీరింగ్ విద్యార్థిని.. ముగ్గురు యువకుల అత్యాచారం
Advertisement
చిత్తూరు జిల్లా కురబలకోట మండలంలో గత నెల 3న ఓ ఇంజినీరింగ్ విద్యార్థినిపై జరిగిన సామూహిక అత్యాచార ఘటన ఒకటి తాజాగా వెలుగులోకి వచ్చింది. ఇంజినీరింగ్ చదువుతున్న యువతి ఆ రోజు సాయంత్రం తన స్నేహితుడిని కలిసేందుకు హంద్రీనీవా కాలువ వద్దకు వెళ్లింది. ఆమె తన స్నేహితుడితో మాట్లాడుతున్న సమయంలో అదే ప్రాంతానికి మద్యం తాగేందుకు వచ్చిన యువకులు ముగ్గురు వారిపై దాడిచేశారు. ఆమె స్నేహితుడిని కొట్టి బెదిరించి అక్కడి నుంచి పంపించి వేశారు. అనంతరం ముగ్గురూ కలిసి యువతిపై అత్యాచారానికి పాల్పడ్డారు.

తాజాగా, ఈ ఘటనపై యువతి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో విషయం వెలుగులోకి వచ్చింది. ఈ విషయాన్ని బయటపెడితే చంపుతామని తమను బెదిరించారని పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో యువతి పేర్కొంది. అందుకనే ఇన్ని రోజులు ఈ విషయాన్ని బయటపెట్టలేదని తెలిపింది. తాజాగా, అనారోగ్యానికి గురికావడంతో తన తల్లితో ఈ విషయాన్ని పంచుకున్నానని, ఆమె సాయంతో పోలీసులకు ఫిర్యాదు చేశానని బాధితురాలు పేర్కొంది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు కమతంవారిపల్లెకు చెందిన అష్రఫ్, జయచంద్ర, మస్తాన్‌వల్లిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Fri, Aug 23, 2019, 09:15 AM
Copyright © 2020; www.ap7am.com
Privacy Policy | Desktop View