ప్రేమ వివాహం చేసుకుందన్న కోపంతో కుమార్తెను కిడ్నాప్ చేసిన తల్లిదండ్రులు... హైదరాబాద్ లో కలకలం!
Advertisement
ప్రేమ వివాహం చేసుకుందన్న కోపంతో, కన్న బిడ్డను కిడ్నాప్ చేశారు తల్లిదండ్రులు. ఈ ఘటన హైదరాబాద్, అంబర్‌ పేట పోలీ‌స్‌ స్టేషన్‌ పరిధిలో జరిగింది. పోలీసులు వెల్లడించిన మరిన్ని వివరాల ప్రకారం, నల్లగొండ జిల్లాకు చెందిన పల్లపు రాజు (24) నిజాం కాలేజీలో చదువుతున్న సమయంలో ఎల్బీ నగర్‌ కు చెందిన బిందు (19)తో ఏర్పడిన పరిచయం ప్రేమగా మారగా, ఇద్దరూ జూలై 15వ తేదీన నిజామాబాద్‌ ఆర్య సమాజ్‌ లో పెళ్లి చేసుకున్నారు. ఈ విషయం యువతి కుటుంబ సభ్యులకు తెలియడంతో పెళ్లికి అంగీకరించబోమని చెప్పి, ఎల్బీ నగర్‌ ఠాణాలో ఫిర్యాదు చేశారు. ఆపై పోలీసులు వారిని విచారించగా, తాము మేజర్లమని, ప్రేమించు కున్నామని తెలిపారు.

ఆపై పోలీసులు ఇరువురి తల్లిదండ్రులనూ పిలిపించి కౌన్సెలింగ్ నిర్వహించి, సర్దిచెప్పి పంపారు. కొద్ది రోజులు వారి కాపురం సజావుగా సాగగా, బిందు తల్లిదండ్రులు నిన్న మధ్యాహ్నం అంబర్‌ పేటలో ఉన్న రాజు ఇంటికి 15 మందితో వెళ్లి, బిందును బలవంతంగా లాక్కెళ్లారు. అడ్డుకున్న రాజుపై కత్తులతో దాడిచేశారు. కత్తిపోట్ల గాయాలతో పోలీసులను ఆశ్రయించిన రాజు, తన భార్యను కిడ్నాప్‌ చేశారంటూ ఫిర్యాదు చేయగా, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు.
Fri, Aug 23, 2019, 08:51 AM
Advertisement
Advertisement
Copyright © 2019; www.ap7am.com
Privacy Policy | Desktop View