టీఆర్ఎస్ ప్రభుత్వం అవినీతిలో కూరుకుపోయింది: జేపీ నడ్డా
Advertisement
ఓటు బ్యాంకు రాజకీయాల కోసమే ఇన్నాళ్లూ ఆర్టికల్ 370ను కొనసాగించారని కాంగ్రెస్ పార్టీపై బీజేపీ జాతీయ కార్యనిర్వాహక అధ్యక్షుడు జేపీ నడ్డా విమర్శలు చేశారు. హైదరాబాద్ లోని ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ లో బీజేపీ నిర్వహించిన బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ, కాంగ్రెస్ పార్టీకి స్వప్రయోజనాలే ముఖ్యం తప్ప, దేశ ప్రయోజనాలు అవసరంలేదని నిప్పులు చెరిగారు. ట్రిపుల్ తలాక్ రద్దుతో చారిత్రక తప్పిదాన్ని సరిచేశామని అన్నారు. తెలంగాణలో టీఆర్ఎస్ ప్రభుత్వం చెప్పేదొకటి, చేసేదొకటని, పూర్తిగా అవినీతిలో కూరుకుపోయిందని ఆరోపించారు.

తెలంగాణలో నిర్వహిస్తున్న హరితహారం కార్యక్రమంలో భారీగా అవినీతి జరుగుతోందని, ఇందుకు సంబంధించిన లెక్కలు, ఆడిటింగ్ చూపించడం లేదని, ముప్పై వేల కోట్లతో నిర్మించాల్సిన కాళేశ్వరం ప్రాజెక్టును లక్ష కోట్లకు పెంచారని. కాళేశ్వరం ప్రాజెక్ట్ కు పవిత్రమైన పేరు పెట్టి కోట్లు దోచుకుంటున్నారని, మిషన్ కాకతీయ పథకం ‘మిషన్ ఫర్ కమిషన్’ గా మారిందని ఆరోపించారు.

తెలంగాణలో రెండు పడకలగదుల ఇల్లు నిర్మిస్తామని చెప్పిన ప్రభుత్వం ఇప్పటి వరకూ ఎన్ని ఇళ్లు ఇచ్చిందని ప్రశ్నించారు. వాస్తు పేరుతో సచివాలయాన్ని కూలగొడుతున్నారని ధ్వజమెత్తిన నడ్డా, ఇతర పార్టీల నుంచి బీజేపీలో చేరుతున్నవారిని చూసి టీఆర్ఎస్ కడుపుమండుతోందని, టీఆర్ఎస్ నేతలు కూడా తమ పార్టీలో చేరేందుకు చూస్తున్నారని వ్యాఖ్యానించారు.  
Sun, Aug 18, 2019, 07:08 PM
Advertisement
Advertisement
Copyright © 2020; www.ap7am.com
Privacy Policy | Desktop View