75 రోజుల్లోనే ఎంతో చేశాం: ప్రత్యేక ఇంటర్వ్యూలో నరేంద్ర మోదీ
Advertisement
యూపీఏ సర్కారు రెండో సారి అధికారంలోకి వచ్చిన తరువాత 75 రోజుల్లోనే స్పష్టమైన విధానం, సరైన దిశతో ముందుకు సాగుతున్నామన్న సంకేతాలను ఇచ్చామని ప్రధాని నరేంద్ర మోదీ వ్యాఖ్యానించారు. తాను రెండోసారి ప్రధానిగా బాధ్యతలు చేపట్టి 75 రోజులు గడిచిన సందర్భంగా ఐఏఎన్ఎస్ కు ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చిన ఆయన, బాధ్యతలను చేపట్టిన కొద్ది రోజుల్లోనే కీలక నిర్ణయాలను వేగంగా అమలు చేయాలని, తమకు స్పష్టమైన విధానం, మంచి ఉద్దేశాలు ఉండటం వల్లే మార్పులు సంభవించాయని అన్నారు.

"ఇండియాలో చిన్నారులకు భద్రత నుంచి చంద్రయాన్‌–2 వరకు, అవినీతిపై పోరు నుంచి ముస్లిం మహిళకు రక్షగా ఉండే ట్రిపుల్‌ తలాఖ్ చట్టం వరకు ఎన్నో తెచ్చాం. ఆర్టికల్ 370 రద్దు నుంచి రైతు సంక్షేమం వరకు... ప్రజల తరఫున పనిచేయాలనుకునే కృతనిశ్చయంతో ఉన్న ప్రభుత్వం మాది. మేము ఏమి చేయగలమని ప్రజలు అనుకున్నారో, అంతకన్నా ఎక్కువే చేసి చూపించాం" అని నరేంద్ర మోదీ పేర్కొన్నారు.

ప్రజలకు జీవితావసరమైన నీటిని అందరికీ దగ్గర చేసేందుకు నీటి సంరక్షణ విధానాలను పటిష్టం చేశామని, అందుకోసం ప్రత్యేకించి జల్‌ శక్తి మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేశామని గుర్తు చేశారు. 1952 తరువాత తాజా లోక్ సభ సమావేశాలు అత్యంత ఫలవంతంగా సాగాయని అభిప్రాయపడ్డారు. ఈ సమావేశాల్లో వ్యాపారులు, రైతులకు పింఛన్లు అందించే బిల్లుతో పాటు, వైద్య రంగం సంస్కరణలకు ఉద్దేశించిన బిల్లు, దివాలా కోడ్, కార్మిక చట్టాల సంస్కరణల బిల్లులను ఆమోదించామని అన్నారు. వీటితో పాటు అత్యంత కీలకమైన జమ్మూ కశ్మీర్‌ పునర్వ్యవస్థీకరణ బిల్లును కూడా సభ ఆమోదించిందన్నారు.

ఇదే సమయంలో విదేశాంగ శాఖ మాజీ మంత్రి, దివంగత సుష్మా స్వరాజ్‌ ను మోదీ గుర్తు చేసుకున్నారు. ప్రొటోకాల్‌ స్థాయి అధికారులు కూడా ప్రజల పిలుపునకు స్పందించేలా తన కార్యాలయాన్ని ఆమె మార్చారని కొనియాడారు. 2014లో ఐక్యరాజ్యసమితి సభలో తాను ప్రసంగించాల్సిన సమయంలో సుష్మతో జరిగిన సంభాషణను ఆయన పంచుకున్నారు. నాటి సమావేశంలో ఏం మాట్లాడుతారని ఆమె ప్రశ్నించారని, తాను ప్రసంగాలను ముందుగానే రాసుకోబోనని చెప్పగా, అది కుదరదని, ఇండియా గురించి చెప్పేటప్పుడు మీకు నచ్చినట్లు ప్రసంగించడానికి వీల్లేదని ఆమె పట్టుబట్టారని అన్నారు. ఎంత గొప్ప వక్తలైనా కొన్ని చోట్ల చూసి చదవాల్సిందేనని ఆమె అనేవారని, తాను కూడా దాన్నే అనుసరించానని చెప్పారు.
Wed, Aug 14, 2019, 10:29 AM
Advertisement
Advertisement
Copyright © 2019; www.ap7am.com
Privacy Policy | Desktop View