పోలీసులు వేధిస్తున్నారంటూ... టీవీ చానెల్ రిపోర్టర్ ఆత్మహత్యా యత్నం!
తనకు ఏ మాత్రం సంబంధంలేని గొడవ గురించి, అనవసరంగా పోలీసులు వేధించారన్న మనస్తాపంతో ఓ టీవీ చానెల్ విలేకరి ఆత్మహత్యాయత్నం చేసిన ఘటన హైదరాబాద్ లో జరిగింది. వివరాల్లోకి వెళితే, మల్లాపూర్‌కు చెందిన శ్రీనివాస్‌ అనే యువకుడు ఓ ప్రముఖ చానెల్ లో విలేకరిగా పని చేస్తున్నాడు. సోమవారం రాత్రి బాలాపూర్ పరిధిలోని ఓ చిన్న స్టోర్ లో గొడవ జరుగగా, అందులో శ్రీనివాస్ ప్రమేయముందని పోలీసులకు తెలిసింది.

దీంతో సీఐ సైదులు అతన్ని స్టేషన్ కు పిలిపించాడు. స్టేషన్ నుంచి బయటకు వచ్చిన తరువాత, పోలీసులు తనను వేధించారని ఆరోపిస్తూ, సమీపంలోని వాటర్ ట్యాంక్ పైకి ఎక్కి పెట్రోల్ తాగి ఆత్మహత్యాయత్నం చేశాడు. విషయాన్ని గమనించిన స్థానికులు హుటాహుటిన అతన్ని ఆసుపత్రికి తరలించగా, ప్రస్తుతం ఐసీయూలో చికిత్స పొంతున్నాడని అతని భార్య లావణ్య తెలిపింది.

సంబంధం లేని గొడవలో తన భర్తను ఇరికించి, వేధించారని, అవమానించారని ఆమె అంటుండగా, పోలీసులు మాత్రం గొడవలో అతని పాత్రపై అనుమానం వచ్చి సమాచారం అడిగి పంపామే తప్ప, అవమానించలేదని అంటున్నారు. ఈ ఘటనలో పోలీసుల వైఖరిని నిరసిస్తూ, శ్రీనివాస్ కుటుంబీకులు ధర్నా నిర్వహించారు. మొత్తం ఘటనపై ఆరా తీస్తున్నట్టు పోలీసు ఉన్నతాధికారులు పేర్కొన్నారు. 
Wed, Aug 14, 2019, 09:39 AM
Advertisement
Advertisement
Copyright © 2019; www.ap7am.com
Privacy Policy | Desktop View