నీటి కొరతను అధిగమించేందుకు ప్రిన్సిపాల్ ‘అద్భుత’ నిర్ణయం.. మండిపడుతున్న తల్లిదండ్రులు!
Advertisement
స్నానాలకు నీటి కొరత ఉండడంతో బాలికల జుట్టును కత్తిరించారు గురుకుల పాఠశాల సిబ్బంది. మెదక్‌లోని గిరిజన మినీ గురుకుల పాఠశాలలో జరిగిందీ ఘటన. ఈ పాఠశాలలో ఒకటో తరగతి నుంచి ఆరో తరగతి వరకు మొత్తం 180 మంది బాలికలు చదువుకుంటున్నారు. స్కూల్లోని బావి అడుగంటిపోవడంతో విద్యార్థుల స్నానాలకు నీళ్ల కొరత ఏర్పడింది. దీనిని అధిగమించేందుకు ఏం చేయాలో పాలుపోని ప్రిన్సిపాల్ బాలికలందరికీ జుట్టు కత్తిరించడం ద్వారా నీటి కొరతను నివారించవచ్చన్న ‘అద్భుత’ ఆలోచనకు వచ్చారు.  

ఆలోచన వచ్చిందే తడవుగా బాలికలందరికీ జుట్టు కత్తిరించాల్సిందిగా సిబ్బందిని ఆదేశించారు. వారు ఎంచక్కా జుట్టు కత్తిరించేసి అమ్మాయిలను అబ్బాయిల్లా తీర్చిదిద్దారు. ఆది, సోమవారాలు సెలవు కావడంతో తమ పిల్లలను చూసేందుకు వచ్చిన తల్లిదండ్రులు.. వారిని చూసి విస్తుపోయారు.

ఎందుకిలా చేశారని సిబ్బందిని ప్రశ్నిస్తే చావు కబురు చల్లగా చెప్పారు. నీటి కొరత కారణంగా జుట్టు కత్తిరించాల్సి వచ్చిందని చెప్పుకొచ్చారు. దీంతో విషయం వెలుగులోకి వచ్చింది. పిల్లల ఇష్టాయిష్టాలతో పనిలేకుండా వారి జుట్టు కత్తిరించిన ప్రిన్సిపాల్‌పై సర్వత్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. నీటిని ఆదా చేసేందుకే ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని ప్రిన్సిపాల్ అరుణ వివరణ ఇచ్చారు.
Wed, Aug 14, 2019, 09:12 AM
Advertisement
Advertisement
Copyright © 2019; www.ap7am.com
Privacy Policy | Desktop View