అంత్యక్రియలకు డబ్బుల్లేక తల్లి మృతదేహాన్ని చెత్తలో వేసిన పూజారి!
Advertisement
 చేస్తున్నదేమో గౌరవ ప్రదమైన పూజారి పని. వచ్చేదేమో చాలీ చాలని ఆదాయం. ఏదోలా బతుకుబండిని ఈడ్చుకుంటూ వస్తున్న అతనికి పెద్ద సమస్య వచ్చిపడింది. హఠాత్తుగా అనారోగ్యంతో తల్లి మృతి చెందగా, అంత్యక్రియలు నిర్వహించడానికి కూడా డబ్బులు లేకుండా పోయాయి.

ఏం చేయాలో తెలియని స్థితిలో గుండెను రాయిని చేసుకుని తల్లి మృతదేహాన్ని చెత్తకుప్పలో వేశాడు. అలా చేస్తే, కనీసం మునిసిపాలిటీ వాళ్లయినా తీసుకెళ్లి అంత్యక్రియలు చేస్తారన్నది అతని ఆలోచన. కానీ ఈ విషయం బయటకు తెలిసింది. అంతే, మానవత్వం వెల్లివిరిసింది. ఆ తల్లికి అంతిమ సంస్కారాలు శాస్త్రోక్తంగా జరిగేందుకు ప్రతి ఒక్కరూ సాయపడ్డారు.

ఈ ఘటన తమిళనాడులోని తూత్తుక్కుడిలో జరిగింది. వివరాల్లోకి వెళితే, ఇక్కడి ధనశేఖరన్‌ నగర్‌ ప్రాంతంలో చెత్తకుండిలో ఉన్న వ్యర్థాలను తీసుకెళ్లేందుకు కార్మికులు రాగా, మృతదేహం కనిపించింది. దీంతో దిగ్భ్రాంతికి చెందిన వారు, పోలీసులకు సమాచారం ఇచ్చారు. వారు వచ్చి ఆమె పేరు వాసంతి అని, పూజారిగా పనిచేసే కుమారుడు ముత్తు లక్ష్మణన్, ఆమెను అక్కడ పడేశాడని తేల్చారు. విషయాన్ని ఆరా తీస్తే, అంత్యక్రియలకు డబ్బుల్లేకపోవడమే ఇందుకు కారణమని తేలింది.

చాలీచాలని ఆదాయంతో కడు పేదరికంలో కాలం వెళ్లదీస్తున్న లక్ష్మణన్, గుండెను రాయిని చేసుకుని కన్న తల్లిని అలా వదిలేశాడని తెలిసింది. అతని వద్ద నిజంగానే డబ్బు లేదని తెలుసుకున్న స్థానికుల గుండెలు బరువెక్కాయి. దాతలు వెల్లువెత్తారు. ఆమెకు అన్ని సంస్కారాలతో దహన క్రియలు జరిపించేందుకు సాయం చేసి, తమలోని దాతృత్వాన్ని చాటుకున్నారు.
Wed, Aug 14, 2019, 09:02 AM
Advertisement
Advertisement
Copyright © 2019; www.ap7am.com
Privacy Policy | Desktop View