తెలంగాణ ఇంటర్ విద్యార్థుల ఆత్మహత్యలపై రాష్ట్రపతికి బీజేపీ ఫిర్యాదు.. స్పందించి నివేదిక కోరిన కోవింద్
Advertisement
తెలంగాణలో ఇటీవల కలకలం రేపిన ఇంటర్ విద్యార్థుల ఆత్మహత్యలపై నివేదిక ఇవ్వాలంటూ రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ కేంద్ర హోంమంత్రిత్వ శాఖను ఆదేశించారు. ఈ ఏడాది ఏప్రిల్‌లో విడుదలైన ఇంటర్ ఫలితాల్లో సాంకేతిక, మానవ తప్పిదాల కారణంగా మార్కుల్లో తేడాలు చోటు చేసుకున్నాయి. కొందరికి బాగా ఎక్కువగా మార్కులు రాగా, మరికొందరికి బాగా తక్కువగా వచ్చాయి. ఫస్ట్ క్లాస్ స్టూడెంట్స్ కూడా ఫెయిల్ అయ్యారు.

మార్కులు చూసి మనస్తాపానికి గురైన పలువురు విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడ్డారు. మొత్తంగా 27 మంది ప్రాణాలు తీసుకున్నారు. ఈ వ్యవహారంపై బీజేపీ తెలంగాణ చీఫ్ కె.లక్ష్మణ్‌, ఇతర నేతలు గత నెల 1న రాష్ట్రపతిని కలిసి ఫిర్యాదు చేశారు. 27 మంది విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడినా ప్రభుత్వంలో చలనం లేదని, తప్పిదాలకు పాల్పడిన ఇంటర్‌ బోర్డు, గ్లోబరీనా సంస్థపై చర్యలు తీసుకోలేదని పేర్కొన్నారు. బాధిత విద్యార్థుల కుటుంబాలకు న్యాయం చేయాలని కోరారు. ఈ మేరకు విద్యార్థులకు సంబంధించిన పూర్తి వివరాలను రాష్ట్రపతికి అందించారు.

బీజేపీ నేతల ఫిర్యాదుపై స్పందించిన రాష్ట్రపతి ఈ వ్యవహారంపై తనకు పూర్తి నివేదిక ఇవ్వాలని కేంద్ర హోంమంత్రిత్వ శాఖను ఆదేశించారు. దీంతో స్పందించిన కేంద్ర హోం శాఖ ఈ నెల 7న తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్‌కే జోషికి నివేదిక కోరుతూ లేఖ రాసింది. తమ ఫిర్యాదుపై స్పందించిన రాష్ట్రపతికి కె.లక్ష్మణ్ ధన్యవాదాలు తెలిపారు. 
Wed, Aug 14, 2019, 07:42 AM
Advertisement
Advertisement
Copyright © 2019; www.ap7am.com
Privacy Policy | Desktop View