బొత్సకు బ్యాంకాక్, పటాయా లలో తిరగడం తప్ప ఏం తెలుసు?: టీడీపీ నేత పంచుమర్తి అనురాధ తీవ్ర వ్యాఖ్యలు
Advertisement
ఏపీలో కేవలం రూ.5 కే భోజనం పెట్టే అన్న క్యాంటీన్లను వైసీపీ ప్రభుత్వం మూసివేస్తుండటంపై  టీడీపీ నేత పంచుమర్తి అనురాధ మండిపడ్డారు. ‘ఎన్టీవీ’ చర్చా కార్యక్రమంలో పాల్గొన్న ఆమె మాట్లాడుతూ, ఇంత కర్కోటకంగా ప్రభుత్వం ఎందుకు వ్యవహరిస్తోందని ప్రశ్నించారు.

టీడీపీకి అనుకూలంగా ఉన్న ప్రాంతాల్లో అన్న క్యాంటీన్లను గత ప్రభుత్వం ఏర్పాటు చేసిందని, బిల్లులు ఎక్కువగా తీసుకున్నారని, వీటన్నింటినీ సంస్కరించిన తర్వాత మళ్లీ ప్రారంభిస్తామని మంత్రి బొత్స సత్యనారాయణ స్పష్టం చేసిన విషయాన్ని ప్రస్తావించగా అనూరాధ స్పందిస్తూ, ‘ఇచ్చారు లెండి, ఏం క్లారీటీ అది? బ్యాంకాక్ లో, పటాయాలో తిరగడం తప్ప వారికి ఏం తెలుసు?’ అని తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

తమ ప్రభుత్వ హయాంలోని మద్యం పాలసీలోని అంశాలు ప్రస్తుత వైసీపీ ప్రభుత్వానికి నచ్చాయని, అందుకే సెప్టెంబర్ వరకూ ఆ పాలసీని పొడిగించారని, అన్న క్యాంటీన్లను మాత్రం మూసేశారని విరుచుకుపడ్డారు. కార్మికులు ఎక్కడైతే ఎక్కువగా ఉన్నారో అక్కడే వాటిని ఏర్పాటు చేశామని స్పష్టం చేశారు.

విజయవాడలోని బందరు రోడ్డులో అన్న క్యాంటీన్ లేదు, కార్మికులు ఎక్కువగా ఉండే కృష్ణలంకలో ఉందని అన్నారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో వచ్చిన పథకం ‘ఆరోగ్య శ్రీ’ అని, అందులోని లోటుపాట్లన్నీ సరిదిద్ది అందులో అదనంగా దాదాపు పద్నాలుగు వందల వ్యాధులను ‘ఆరోగ్యశ్రీ’లో చేర్చి.. ఎన్టీఆర్ వైద్య సేవ కింద తమ హయాంలో కొనసాగించామని గుర్తుచేశారు.

అన్న క్యాంటీన్ల ద్వారా ఐదు రూపాయలకే పేదలకు అందిస్తున్న భోజనాన్ని తీసివేయాల్సిన అవసరం ప్రభుత్వానికి ఏంటని ప్రశ్నించారు. అవసరమైతే, అన్న క్యాంటీన్ మెనూలో ఒక ఎగ్, ఫ్రైడ్ రైస్ లేదా వెజిటబుల్ పలావ్ చేర్చాలే తప్ప వాటిని మూసేయడం సబబు కాదని అన్నారు.
Tue, Aug 13, 2019, 08:35 PM
Advertisement
Advertisement
Copyright © 2019; www.ap7am.com
Privacy Policy | Desktop View