అక్కడ మన కోసం పూల దండలు పట్టుకుని ఎవరూ ఎదురుచూడటం లేదు: తమ దేశ ప్రజలకు పాకిస్థాన్ విదేశాంగ మంత్రి చురక
Advertisement
ఆర్టికల్ 370ని భారత ప్రభుత్వం రద్దు చేసిన తర్వాత పాకిస్థాన్ కుతకుతలాడుతోంది. అంతర్జాతీయ సమాజం మద్దతును కూడగట్టుకోవాలని విశ్వ ప్రయత్నం చేసినా... ఏ దేశం కూడా పాక్ కు అనుకూలంగా స్పందించలేదు. ఇది భారత్ అంతర్గత వ్యవహారం అంటూ పక్కకు తప్పుకున్నాయి. ఈ నేపథ్యంలో తమకు ఎవరూ అండగా నిలవరనే విషయం పాకిస్థాన్ కు బోధపడింది. మరోవైపు, పాక్ ప్రభుత్వంపై ఆ దేశంలో తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

ఈ నేపథ్యంలో పాక్ ప్రజలపై ఆ దేశ విదేశాంగశాఖ మంత్రి షా మెహ్మూద్ ఖురేషీ అసహనం వ్యక్తం చేశారు. జమ్ము, కశ్మీర్ కు ప్రత్యేక ప్రతిపత్తిని కల్పిస్తున్న ఆర్టికల్ 370ని రద్దు చేసిన అంశంపై ఐక్యరాజ్యసమితి భద్రతామండలి మనకు సహకారం అందిస్తుందనే భావనలో మూర్ఖుల స్వర్గంలో (ఫూల్స్ ప్యారడైజ్) బతకొద్దని ఆయన వ్యాఖ్యానించారు. అక్కడ మన కోసం ఎవరూ పూల దండలు పట్టుకుని ఎదురుచూడటం లేదని అన్నారు.

భావోద్వేగాలకు గురి కావడం, అభ్యంతరాలను వ్యక్తం చేయడం చాలా సులభమని... సమస్యను అర్థం  చేసుకుని ముందుకు సాగడమే కష్టమని ఖురేషీ తెలిపారు. భద్రతామండలి సభ్యదేశాల్లోని ఏ దేశమైనా మనకు అడ్డుపడవచ్చని వ్యాఖ్యానించారు. భారత్ తీసుకున్న నిర్ణయానికి రష్యా ఇప్పటికే సంపూర్ణ మద్దతు పలికిన సంగతి తెలిసిందే.
Tue, Aug 13, 2019, 04:51 PM
Advertisement
Advertisement
Copyright © 2019; www.ap7am.com
Privacy Policy | Desktop View