కశ్మీర్ అంశంలో మధ్యవర్తిత్వం వహించే ఆలోచన లేదని ట్రంప్ స్పష్టంగా చెప్పారు: అమెరికాలో భారత రాయబారి
Advertisement
కశ్మీర్ వివాదాన్ని పరిష్కరించేందుకు అవసరమైతే మధ్యవర్తిత్వం వహించేందుకు తాను సిద్ధంగా ఉన్నానని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చేసిన వ్యాఖ్యలు కలకలం రేపిన సంగతి తెలిసిందే. ఎవరి మధ్యవర్తిత్వం అవసరం లేదని... సమస్యను తామే పరిష్కరించుకుంటామని భారత్ ఘాటుగా స్పందించింది. దీంతో, అమెరికా మెత్తబడింది. భారత ప్రధాని మోదీ కోరితేనే తాను కలగజేసుకుంటానని ట్రంప్ కూడా యూటర్న్ తీసుకున్నారు. ఆ తర్వాత వెనువెంటనే జమ్ముకశ్మీర్ ను రెండు కేంద్రపాలిత ప్రాంతాలు చేయడం, ఆర్టికల్ 370ని రద్దు చేయడం జరిగిపోయాయి. దీనిపై గగ్గోలు పెడుతున్న పాకిస్థాన్... అంతర్జాతీయంగా ఏ దేశ మద్దతునూ కూడగట్టుకోలేకపోయింది.

మరోవైపు, కశ్మీర్ విషయంలో మధ్యవర్తిత్వం వహించే ఎలాంటి ఆలోచన తమకు లేదని ట్రంప్ స్పష్టంగా చెప్పారని అమెరికాలో భారత రాయబారి హర్ష్ వర్దన్ శ్రింగ్లా తెలిపారు. ఇండియా-పాకిస్థాన్ లు చర్చల ద్వారానే కశ్మీర్ సమస్యను పరిష్కరించుకోవాలని దశాబ్దాల నాటి అమెరికా పాత పాలసీ చెబుతోందని... మధ్యవర్తిత్వం వహించాలనేది ఆ పాలసీలో లేదని అన్నారు. మధ్యవర్తిత్వానికి తాము ఒప్పుకోబోమని భారత్ స్పష్టం చేయడంతో... మధ్యవర్తిత్వం వహించే ఆలోచన తమకు లేదని ట్రంప్ స్పష్టం చేశారని తెలిపారు. లాహోర్ డిక్లరేషన్, సిమ్లా ఒప్పందం మేరకు ఇరు దేశాలు కశ్మీర్ సమస్యను పరిష్కరించుకోవాలని ట్రంప్ చెప్పారని అన్నారు.
Tue, Aug 13, 2019, 12:14 PM
Advertisement
Advertisement
Copyright © 2019; www.ap7am.com
Privacy Policy | Desktop View