ఆకతాయిల బెదిరింపులు.. ట్విట్టర్ ఖాతా క్లోజ్ చేసిన అనురాగ్ కశ్యప్!
Advertisement
ప్రముఖ బాలీవుడ్ దర్శకుడు అనురాగ్ కశ్యప్ తీవ్రమైన నిర్ణయం తీసుకున్నారు. సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ ట్విట్టర్ నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించారు. ప్రధాని మోదీ నేతృత్వంలోని ఎన్డీయే ప్రభుత్వం దుందుడుకు నిర్ణయాలు, మూకహత్యలకు వ్యతిరేకంగా పలువురు ప్రముఖులతో కలిసి అనురాగ్ కశ్యప్ ఉద్యమించారు. అయితే ఈ సందర్భంగా బీజేపీ మద్దతుదారులు, హిందుత్వ వాదుల నుంచి విమర్శలు ఎదురైనా ఆయన పట్టించుకోలేదు.

అయితే తాజాగా తన తల్లిదండ్రులు, కుమార్తెకు గుర్తుతెలియని వ్యక్తుల నుంచి బెదిరింపు కాల్స్ వస్తున్నాయని కశ్యప్ తెలిపారు. ఈ నేపథ్యంలో తన కారణంగా కుటుంబ సభ్యులకు ఎలాంటి ప్రమాదం జరగరాదన్న ఉద్దేశంతో ట్విట్టర్ నుంచి తప్పుకుంటున్నానని చెప్పారు.

ప్రస్తుతం భారత్ వెళుతున్న దారిలో తాను నడవలేననీ, అందరూ అభివృద్ధి చెందాలని కోరుకుంటున్నట్లు పేర్కొన్నారు. భయం లేకుండా స్వేచ్ఛగా మాట్లాడే అవకాశం లేనప్పుడు అస్సలు మాట్లాడకపోవడమే మంచిదని అభిప్రాయపడ్డారు. ఈ మేరకు అనురాగ్ కశ్యప్ ట్వీట్ చేశారు. అనంతరం తన ట్విట్టర్ ఖాతాను క్లోజ్ చేశారు.
Sun, Aug 11, 2019, 11:57 AM
Advertisement
Advertisement
Copyright © 2019; www.ap7am.com
Privacy Policy | Desktop View