టీమిండియాలో గంటకు 150 కిమీ వేగంతో బంతులేసే బౌలరొచ్చాడు!
Advertisement
ప్రస్తుతం టీమిండియాలో అందరికంటే ఫాస్ట్ గా బంతులు విసిరే బౌలర్ ఎవరంటే జస్ప్రీత్ బుమ్రా పేరే చెప్పాలి. బుమ్రా నిలకడగా గంటకు 145 కిమీ వేగంతో బంతులేస్తుంటాడు. అయితే, ఇప్పుడు టీమిండియాలోకి మరో ఎక్స్ ప్రెస్ బౌలర్ వచ్చాడు. వెస్టిండీస్ టూర్ కోసం టీమిండియాలోకి ఎంపికైన నవదీప్ సైని నిజంగానే సూపర్ ఫాస్ట్ బౌలర్ అని చెప్పాలి. ఐపీఎల్ లో సైని విసిరిన ఓ బంతి వేగం గంటకు 152 కిలోమీటర్లుగా నమోదైంది.

26 ఏళ్ల సైని స్వస్థలం హర్యానాలోని కర్నాల్. తమ ప్రాంతంలో చిన్నచితకా టోర్నమెంట్లు ఆడుతూ మ్యాచ్ కు రూ.200 పారితోషికం తీసుకునేవాడు. మొదట్లో టెన్నిస్ బాల్ క్రికెట్ ఆడిన ఈ యువ ఫాస్ట్ బౌలర్ 2013లో తొలిసారి క్రికెట్ బాల్ పట్టుకున్నాడు. అయితే, టీమిండియా మాజీ ఓపెనర్ గౌతమ్ గంభీర్ ఈ హర్యానా యువకుడిలో ఉన్న టాలెంట్ ను గుర్తించి ప్రోత్సహించాడు. ఢిల్లీ జట్టులో వరుసగా అవకాశాలు కల్పించి జాతీయస్థాయిలో సైని అంటే ఓ గుర్తింపు లభించేలా చేశాడు. అందుకే తన ఎదుగుదలలో గంభీర్ పాత్ర ఎంతో ఉందని సైని వినమ్రంగా చెబుతాడు.

ఆరడుగుల పొడవుండే సైని 43 ఫస్ట్ క్లాస్ మ్యాచ్ లు ఆడి 120 వికెట్లు తీశాడు. సైని విండీస్ టూర్ లో వన్డే, టి20 సిరీస్ లకు ఎంపికయ్యాడు. ప్రస్తుతం ఇండియా-ఎ జట్టు తరఫున మ్యాచ్ లు ఆడుతూ వెస్టిండీస్ లోనే ఉన్నాడు. అక్కడి పిచ్ లపై అవగాహనతో ఉన్న సైని, టీమిండియా తరఫున కూడా రాణించి జట్టులో తన స్థానం సుస్థిరం చేసుకోవాలని భావిస్తున్నాడు.
Mon, Jul 22, 2019, 07:29 PM
Advertisement
Advertisement
Copyright © 2019; www.ap7am.com
Privacy Policy | Desktop View