సెటిల్మెంటు చేసుకుందాం రమ్మని చెప్పి చంపడానికి ప్రయత్నించారు: 'జబర్దస్త్' వినోద్
Advertisement
జబర్దస్త్ కార్యక్రమంలో ఆడవేషాలతో ఎంతో పాప్యులరైన వినోద్ పై హైదరాబాద్ లో హత్యాయత్నం జరిగింది. ఓ ఇంటి వివాదంలో వినోద్ పై దాడిచేసిన దుండగులు తీవ్రంగా కొట్టారు. తీవ్రగాయాలపాలైన వినోద్ ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. దీనిపై కాచిగూడ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు నమోదైంది. కాగా, తనపై దాడికి కారణాన్ని వినోద్ మీడియాకు తెలిపాడు. ఇంటి కొనుగోలుకు సంబంధించి ఇద్దరు వ్యక్తులకు రూ.10 లక్షలు ఇచ్చానని, అయితే ఎంతకీ రిజిస్ట్రేషన్ చేయించకపోవడంతో పాటు, తన డబ్బు కూడా వెనక్కి ఇవ్వకపోవడంతో నిలదీశానని వినోద్ వెల్లడించాడు.

సెటిల్మెంటు చేసుకుందాం రమ్మని చెప్పి తనపై హత్యాయత్నం చేశారని తెలిపాడు. రూ.10 లక్షలు అడ్వాన్స్ రూపంలో ఇచ్చానని, అయితే ఇల్లు ఇవ్వం, డబ్బులు ఇవ్వం పొమ్మని అవతలి వ్యక్తులు దౌర్జన్యం చేశారని వినోద్ వాపోయాడు. ఇంటి పైకి పిలిచి గొంతు నులిమి చంపే ప్రయత్నం చేశారని వివరించాడు. తప్పించుకుని కిందికి రాగా, వెంటపడి మరీ కడుపులో తన్నారని, తల చిట్లిందని, ఎముకలు విరిగిపోయాయని చెబుతూ కన్నీటిపర్యంతమయ్యాడు.

Sat, Jul 20, 2019, 04:04 PM
Advertisement
Advertisement
Copyright © 2019; www.ap7am.com
Privacy Policy | Desktop View