బిగ్ బాస్ షో పేరుతో అశ్లీలతను ప్రోత్సహిస్తున్నారంటూ జంతర్ మంతర్ వద్ద ధర్నా
Advertisement
తెలుగు బిగ్ బాస్ వివాదం మరింత ముదురుతోంది. ఓవైపు ఆదివారం బిగ్ బాస్ మూడో సీజన్ ప్రారంభం కావాల్సి ఉండగా, షోపై నెలకొన్న వివాదాలు కొనసాగుతూనే ఉన్నాయి. బిగ్ బాస్ నిర్వాహకులపై పోలీసులకు ఫిర్యాదు చేసిన యాంకర్ శ్వేతారెడ్డి, నటి గాయత్రీ గుప్తా కోర్టులో పిటిషన్ దాఖలు చేయడంతో పాటు ఢిల్లీ వెళ్లి జాతీయ మహిళా కమిషన్ కు కూడా ఫిర్యాదు చేయడం తెలిసిందే.

తాజాగా వీరికి దర్శకుడు కేతిరెడ్డి జగదీశ్వర్ రెడ్డి కూడా జత కలిశారు. ఈ ముగ్గురు ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద ధర్నాకు దిగారు. బిగ్ బాస్ షో ముసుగులో అశ్లీలాన్ని ప్రోత్సహిస్తున్నారంటూ మండిపడ్డారు. రియాల్టీ షో పేరుతో అమ్మాయిలపై లైంగిక వేధింపులకు పాల్పడుతున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.

అంతకుముందు, శ్వేతారెడ్డి, గాయత్రీ గుప్తాల పిటిషన్ పై విచారించిన న్యాయస్థానం బిగ్ బాస్ నిర్వాహకులకు అనుకూలంగా ఆదేశాలు ఇచ్చింది. బిగ్ బాస్ షో నిర్వాహకులను అరెస్ట్ చేయొద్దంటూ పోలీసులకు స్పష్టం చేసింది. దాంతో, బిగ్ బాస్-3 రియాల్టీ షో షెడ్యూల్ ప్రకారమే ఆదివారం ప్రారంభం కానుంది.
Fri, Jul 19, 2019, 02:17 PM
Advertisement
Advertisement
Copyright © 2019; www.ap7am.com
Privacy Policy | Desktop View