ఇరాన్ డ్రోన్ ను కూల్చేసిన అమెరికా యుద్ధనౌక.. ఇరాన్ రెచ్చగొడుతోందన్న ట్రంప్!
Advertisement
అమెరికా-ఇరాన్ ల మధ్య ప్రస్తుతం పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితులు నెలకొన్నాయి. ఇటీవల రెండు ఆయిల్ ట్యాంకర్లు లక్ష్యంగా గుర్తుతెలియని దుండగులు దాడిచేయడంతో దాని వెనుక ఇరానే ఉందని అమెరికా ఆరోపించింది. అయితే దాన్ని ఖండించిన ఇరాన్, ఇలాంటి నిరాధార ఆరోపణలు చేయడం మానుకోవాలని హితవు పలికింది. ఈ క్రమంలో తమ భూభాగంలోకి దూసుకొచ్చిన అమెరికా ‘గార్డియన్ డ్రోన్’ను కూల్చేసిన ఇరాన్ అగ్రరాజ్యానికి దీటుగా హెచ్చరికలు పంపింది. తాజాగా ఇరాన్ చర్యకు అమెరికా ప్రతీకారం తీర్చుకుంది.

హోర్ముజ్ జలసంధిలోని తమ విమానవాహక యుద్ధనౌక యూఎస్ఎస్ బాక్సర్ కు సమీపంగా వచ్చిన ఇరాన్ డ్రోన్ ను అమెరికా కూల్చేసింది. ఈ విషయమై అమెరికా నేవీ అధికారులు మాట్లాడుతూ.. ఇరాన్ కు చెందిన డ్రోన్ తమ యుద్ధనౌకకు 1000 అడుగుల సమీపానికి వచ్చేసిందని తెలిపారు.

తాము పలుమార్లు హెచ్చరించినప్పటికీ డ్రోన్ దూసుకురావడంతో ఆత్మరక్షణలో భాగంగా కూల్చేశామని స్పష్టం చేశారు. కాగా, డ్రోన్ ప్రయోగంతో ఇరాన్ తమను రెచ్చగొట్టేలా వ్యవహరిస్తోందని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కాగా, తమ డ్రోన్ లేవీ అమెరికా యుద్ధనౌకకు సమీపంగా వెళ్లలేదని ఇరాన్ ఐక్యరాజ్యసమితికి తెలిపింది.
Fri, Jul 19, 2019, 12:11 PM
Advertisement
Advertisement
Copyright © 2020; www.ap7am.com
Privacy Policy | Desktop View