నోటీసులు ఇవ్వకుండానే అక్రమ కట్టడాలను కూల్చేలా చట్టాన్ని తీసుకొస్తున్నాం: కేసీఆర్
Advertisement
తెలంగాణ అసెంబ్లీ ప్రత్యేక సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా కొత్త మున్సిపల్ చట్టానికి సంబంధించిన బిల్లుపై ముఖ్యమంత్రి కేసీఆర్ వివరిస్తున్నారు. సభలో ఆయన మాట్లాడుతూ, ఇకపై నగర పంచాయతీలు ఉండవని చెప్పారు. కేవలం మున్సిపాలిటీలు, మున్సిపల్ కార్పొరేషన్లు మాత్రమే ఉంటాయని తెలిపారు. జిల్లా కలెక్టర్లకు విశేష అధికారాలను ఇస్తున్నామని చెప్పారు.

మున్సిపల్ వ్యవస్థను అవినీతిరహితం చేస్తామని కేసీఆర్ తెలిపారు. పట్టణాల్లో 75 చదరపు గజాల వరకు పేదల ఇళ్లకు అనుమతులు అవసరం లేదని చెప్పారు. పట్టణాల్లో 75 గజాలలోపు జీ ప్లస్ వన్ ఇళ్ల నిర్మాణాలకు కూడా పర్మిషన్లు అవసరం లేదని తెలిపారు. వీరికి ప్రాపర్టీ ట్యాక్స్ సంవత్సరానికి రూ. 100 మాత్రమే ఉంటుందని చెప్పారు. ప్రతి ఇంటి యజమాని తన ఇంటిపై సెల్ఫ్ సర్టిఫికేషన్  ఇవ్వాలని తెలిపారు. అయితే, తప్పనిసరిగా ఇంటిని పురపాలికల్లో నమోదు చేసుకోవాలని... నమోదుకు ఒక్క రూపాయి చెల్లిస్తే చాలని చెప్పారు.

నోటీసులు ఇవ్వకుండానే అక్రమ కట్టడాలను కూల్చేలా కొత్త చట్టాన్ని తీసుకొస్తున్నామని కేసీఆర్ చెప్పారు. అక్రమ కట్టడాలను ఉపేక్షించే ప్రసక్తే లేదని అన్నారు. ఆగస్ట్ 15 నుంచి పరిపాలన అంటే ఏంటో చూస్తారని చెప్పారు. యావత్ దేశం మన దగ్గర నుంచి నేర్చుకునేలా పాలనాపరమైన సంస్కరణలను తీసుకొస్తామని తెలిపారు. పంచవర్ష ప్రణాళికలపై ప్రతి ఒక్కరికీ అవగాహన ఉండాలని... వీటిపై ఎమ్మెల్యేలకు శిక్షణ ద్వారా అవగాహన కల్పిస్తామని చెప్పారు.
Fri, Jul 19, 2019, 11:21 AM
Advertisement
Advertisement
Copyright © 2019; www.ap7am.com
Privacy Policy | Desktop View