కర్ణాటక సంక్షోభంలో మరో ట్విస్ట్‌...మళ్లీ సుప్రీం తలుపు తట్టాలని నిర్ణయించిన స్పీకర్‌, సీఎం!
గత కొన్ని రోజులుగా ట్విస్ట్‌ల మీద ట్విస్ట్‌లతో కొనసాగుతున్న కర్ణాటక సర్కారు కథ ఈరోజు మధ్యాహ్నం కంచికి చేరుతుందనుకుంటే మళ్లీ మరో ట్విస్ట్‌కు తెరలేపారు స్పీకర్‌ రమేష్‌కుమార్‌, సీఎం కుమారస్వామిలు. ఎమ్మెల్యేల రాజీనామా అంశంపై నిర్ణయాధికారంలో స్పీకర్‌కు సుప్రీంకోర్టు పూర్తి స్వేచ్ఛ ఇచ్చిన నేపథ్యంలో విప్‌ విషయంలో తగిన మార్గదర్శకాలు జారీ చేయాలంటూ స్పీకర్‌, సీఎం సుప్రీం కోర్టును కోరాలని నిర్ణయించారు.

వాస్తవానికి ఈరోజు మధ్యాహ్నం 1.30 గంటలలోగా విశ్వాస పరీక్ష నిర్వహించి ప్రభుత్వం భవితవ్యం తేల్చాలంటూ కర్ణాటక గవర్నర్‌ నిన్న స్పష్టమైన ఆదేశాలు జారీ చేయడంతో అంతా అలాగే జరుగుతుందనుకున్నారు. తాజాగా స్పీకర్‌, సీఎం తీసుకున్న నిర్ణయంతో మళ్లీ రాజకీయం రసవత్తరంగా మారింది. ప్రభుత్వానికి అనుకూలంగా వ్యవహరిస్తున్నారని విపక్ష బీజేపీ నేత నుంచి ఆరోపణలు ఎదుర్కొంటున్న స్పీకర్‌ గవర్నర్‌ ఆదేశాలను పాటిస్తారా? అన్న సందేహాలు వ్యక్తమవుతుండగానే వీరిద్దరి తాజా నిర్ణయం మరిన్ని సందేహాలకు తావిస్తోంది.

 మరోవైపు ఎట్టి పరిస్థితుల్లోనూ బలపరీక్ష నిర్వహించాల్సిందేనని బీజేపీ ఫ్లోర్‌ లీడర్‌ యడ్యూరప్ప  డిమాండ్‌ చేశారు. ప్రభుత్వానికి బలం లేదని, తామే ప్రభుత్వం ఏర్పాటు చేస్తామని ధీమా వ్యక్తం చేశారు.
Fri, Jul 19, 2019, 10:35 AM
Advertisement
Advertisement
Copyright © 2019; www.ap7am.com
Privacy Policy | Desktop View