ఇక జస్ట్ 15 రోజులే.. పోలవరంలో టీడీపీ నేతలు ఎంత దోచారో బయటకొస్తుంది!: ఏపీ ముఖ్యమంత్రి జగన్
Advertisement
పోలవరం ప్రాజెక్టుపై గత మూడు రోజులుగా అసెంబ్లీలో చర్చ జరుగుతూనే ఉందని ఏపీ ముఖ్యమంత్రి జగన్ తెలిపారు. గత ప్రభుత్వ హయాంలో పోలవరం ప్రాజెక్టు అంతా కుంభకోణాలమయంగా మారిందని ఆరోపించారు. ఈ విషయమై తాము నియమించిన కమిటీ అధ్యయనం చేస్తోందని చెప్పారు. ఏపీ అసెంబ్లీ సమావేశాల సందర్భంగా ముఖ్యమంత్రి జగన్ ఈ మేరకు మాట్లాడారు. తాను ఇటీవల పోలవరం ప్రాజెక్టును సందర్శించానని జగన్ తెలిపారు. అక్కడ గత 4 నెలలుగా పనులు ఆగిపోయిన పరిస్థితి ఉందని అన్నారు.

పోలవరం పనులను ఈ ఏడాది నవంబర్ 1 నుంచి వేగవంతం చేసి 2021 జూన్ నాటికి నీళ్లు ఇవ్వాలన్న లక్ష్యంతో ఉన్నామని వెల్లడించారు. పోలవరం పనులను బిడ్డింగ్ లో ఎవరు తక్కువకు కోట్ చేస్తే వాళ్లకే పనులు అప్పగిస్తామనీ, దీనివల్ల మొత్తం వ్యయంలో 15-20 శాతం నిధులు మిగిలే అవకాశముందని వ్యాఖ్యానించారు. కేవలం రూ.6,500 కోట్ల విలువైన పనుల్లోనే 15-20 శాతం నిధులు మిగిలే అవకాశముందని జగన్ పేర్కొన్నారు.

టీడీపీ హయాంలో నామినేషన్ల పద్ధతిలో కాంట్రాక్టర్లను అప్పగించారని సీఎం ఆగ్రహం వ్యక్తం చేశారు. టీడీపీ నేత యనమల వియ్యంకుడు కూడా సబ్ కాంట్రాక్టర్ గా పనిచేస్తున్నారని విమర్శించారు. ప్రాజెక్టు పనులు ప్రారంభించకుండానే గతంలో టీడీపీ ప్రభుత్వం గుత్తేదారులకు రూ.724 కోట్లు కట్టబెట్టిందని దుయ్యబట్టారు. పోలవరం ప్రాజెక్టులో టీడీపీ నేతలు ఎంత దోచుకున్నారో మరో 15 రోజుల్లో అంతా బయటకొస్తుందని జగన్ హెచ్చరించారు. పోలవరం ప్రాజెక్టు విపరీతమైన కుంభకోణాలతో నిండిపోయిందని పునరుద్ఘాటించారు.
Fri, Jul 19, 2019, 10:31 AM
Advertisement
Advertisement
Copyright © 2019; www.ap7am.com
Privacy Policy | Desktop View