భార్య ప్రియుడిని చంపాలనుకుని 'కరెంట్ షాక్' ప్లాన్.. ముగ్గురి దుర్మరణం!
తన భార్య మరొకరితో వివాహేతర సంబంధం కొనసాగిస్తోందన్న అనుమానంతో ఓ వ్యక్తి, కరెంట్ షాక్ తో ఆమె ప్రియుడిని హతమార్చాలని ప్రయత్నించగా, ముగ్గురు దుర్మరణం పాలై, మరో ఆరుగురికి తీవ్ర గాయాలు అయ్యాయి. ఈ ఘటన పశ్చిమ బెంగాల్ లోని దక్షిణ 24 పరగణాల జిల్లాలో జరిగింది.

 పోలీసులు వెల్లడించిన మరిన్ని వివరాల ప్రకారం, భవన నిర్మాణ కార్మికుడిగా పనిచేసే ఓ వ్యక్తి (46) తన కుటుంబంతో కలిసి నివసిస్తున్నాడు. ఆ దగ్గరిలోనే అతని బంధువులూ ఉంటున్నారు. గత కొంతకాలంగా తన భార్య దగ్గరి బంధువైన మరో వ్యక్తితో సంబంధ పెట్టుకుందని అతనికి అనుమానం. ఇటీవల వారిద్దరూ కలిసి బయటకు వెళ్లడంతో ఈ అనుమానం అతనికి మరింత బలపడింది.

దీంతో భార్య ప్రియుడిని చంపాలని భావించిన అతను, ప్రియుడి ఇంటి గుమ్మం బయట విద్యుత్‌ ప్రసారమయ్యే తీగను తెంచి పడేశాడు. ఇంట్లో ఉన్న అతన్ని బయటకు రప్పించేందుకు బట్టలను తగులబెట్టాడు. మంటల్ని ఆర్పేందుకు ఇంట్లోని వారు ఒకరివెంట ఒకరు బయటకు రాగా, విద్యుత్‌ వైర్‌ తగిలి ముగ్గురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా, మరో ఆరుగురికి తీవ్రగాయాలయ్యాయి.

ఘటన తరువాత నిందితుడు పారిపోయే ప్రయత్నం చేయగా, సమీపంలోని రైల్వే స్టేషన్ లో పట్టుకున్న గ్రామస్తులు దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు. గ్రామస్తుల దాడిలో అతనికి తీవ్రగాయాలు అయ్యాయని, ప్రాణాపాయ స్థితిలో ఉన్నాడని వైద్యులు తెలిపారు.
Fri, Jul 19, 2019, 10:21 AM
Advertisement
Advertisement
Copyright © 2019; www.ap7am.com
Privacy Policy | Desktop View