స్వయంగా మద్యం దుకాణాలు తెరవనున్న ఏపీ సర్కారు!
Advertisement
ఏపీ సీఎం వైఎస్ జగన్, తన నవరత్నాల్లో ఇచ్చిన కీలక హామీ, దశలవారీగా మద్య నిషేధం అమలు దిశగా కీలక అడుగులు పడుతున్నాయి. ప్రభుత్వమే స్వయంగా మద్యం వ్యాపారంలోకి ప్రవేశించనుంది. అందుకు వీలు కల్పించేలా చట్టాన్ని మార్చాలని నిర్ణయించింది. ఇందుకు సంబంధించిన ముసాయిదా బిల్లును మంత్రివర్గం నిన్న ఆమోదించింది. మరో రెండు రోజుల్లో ఈ బిల్లు ఉభయ సభలకు రానుంది. చట్ట సవరణ తరువాత అక్టోబర్ 1 నుంచి ప్రైవేటు మద్యం దుకాణాల స్ధానంలో ప్రభుత్వ మద్యం దుకాణాలు ప్రారంభం అవుతాయి.

ఇక బిల్లులోని ముఖ్య అంశాలను పరిశీలిస్తే, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర బేవరేజస్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌ (ఏపీఎస్‌బీసీఎల్‌) ఇప్పటివరకూ డిస్టలరీలు, బ్రూవరీస్‌ల్లో తయారైన మద్యాన్ని కొనుగోలు చేసి, మద్యం లైసెన్సుదారులకు విక్రయించటానికే పరిమితం కాగా, ఇకపై స్వయంగా మద్యం దుకాణాలను నడపనుంది. ఇక మద్యం ధరలను కూడా పెంచడం ద్వారా ఎక్సైజ్ సుంకం ఆదాయాన్ని రూ. 2,500 కోట్లకు పెంచుకోవాలని ప్రభుత్వం భావిస్తోంది. ధర అధికంగా ఉంటే, తాగేవారి సంఖ్య తగ్గుతుందన్నది ఎక్సైజ్ వర్గాల అభిప్రాయం.

ఇక దుకాణాల విక్రయం ద్వారా వచ్చే ఆదాయం పోయినప్పటికీ, లైసెన్సుదారులకు కమీషన్‌ రూపంలో చెల్లించే మొత్తం ప్రభుత్వానికి మిగులుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు. ప్రభుత్వమే దుకాణాలు నిర్వహించినా, ఖర్చులన్నీ పోను ఆదాయం వస్తుందని తేల్చాయి.

ఇక ప్రభుత్వ దుకాణాలైతే సమయపాలన కచ్చితంగా ఉంటుంది. బెల్ట్ షాపుల బెడద ఉండదు. బల్క్ అమ్మకాలు సాగవు. దీంతో మద్య నిషేధం అమలు దిశగా అడుగులు పడినట్టు అవుతుందన్నది ప్రభుత్వ అభిప్రాయం. ప్రస్తుతం ఏపీలో 4,380కి వరకూ మద్యం దుకాణాలుండగా, వీటిల్లో 800 నుంచి 1,300 వరకూ దుకాణాలు నూతన విధానంలో రద్దు కానున్నాయి.
Fri, Jul 19, 2019, 08:55 AM
Advertisement
Advertisement
Copyright © 2019; www.ap7am.com
Privacy Policy | Desktop View