ఉగాది రోజున బలహీనవర్గాలకు 25 లక్షల ఇళ్ల పట్టాలిస్తున్నాం: ఏపీ మంత్రి పిల్లి సుభాష్ చంద్రబోస్
Advertisement
ఏపీ సచివాలయంలో ఇవాళ రెవెన్యూ, గృహనిర్మాణ మంత్రిత్వ శాఖల ఉమ్మడి సమావేశం జరిగింది. మంత్రులు పిల్లి సుభాష్ చంద్రబోస్, శ్రీరంగనాథరాజు, రెండు శాఖల ఉన్నతాధికారులు, గృహనిర్మాణశాఖ ఎండీ ఈ సమావేశంలో పాల్గొన్నారు. బలహీనవర్గాలకు ఇళ్ల స్థలాలు, ఇళ్ల నిర్మాణాలపై మంత్రులు అధికారులతో సమీక్ష నిర్వహించారు. సమావేశం అనంతరం మంత్రి సుభాష్ చంద్రబోస్ మాట్లాడుతూ, సీఎం జగన్ ఆదేశాల మేరకు ఉగాది రోజున బలహీనవర్గాల ప్రజలకు 25 లక్షల ఇళ్ల పట్టాలు ఇస్తున్నామని వెల్లడించారు.  

గ్రామాల్లో స్థల సేకరణపై అధికారులతో చర్చించామని, ప్రస్తుతం 11,140 ఎకరాల ప్రభుత్వ స్థలాలు అందుబాటులో ఉన్నట్టు అధికారులు చెప్పారని వివరించారు. గ్రామాల్లో స్థలాలను పరిశీలించాలని జిల్లా కలెక్టర్లు, తహసీల్దార్లను ఆదేశించామని చెప్పారు. స్థలాలను విక్రయించేలా రైతులను ఒప్పించాలని అధికారులకు సూచించామని తెలిపారు. ఇళ్ల స్థలాల కోసం ఇప్పటివరకు 26,75,384 దరఖాస్తులు వచ్చాయని మంత్రి పేర్కొన్నారు.

మరో మంత్రి శ్రీరంగనాథరాజు మాట్లాడుతూ, పాతిక లక్షల ఇళ్ల నిర్మాణ ఏర్పాట్లపై అధికారులతో చర్చించినట్టు చెప్పారు. అర్హులైన వారికి ప్రభుత్వం నుంచి రూ.2 లక్షల రుణం అందించేలా ఏర్పాటు చేస్తున్నట్టు వెల్లడించారు. అదే సమయంలో ఇంటి స్థలం ష్యూరిటీతో బ్యాంకుల నుంచి రూ.4 లక్షల వరకు రుణం ఇప్పించేలా చర్యలు తీసుకుంటున్నట్టు తెలిపారు.
Thu, Jul 18, 2019, 08:52 PM
Advertisement
Advertisement
Copyright © 2019; www.ap7am.com
Privacy Policy | Desktop View