సీఎం జగన్ వ్యాఖ్యలతో నిర్మాణ సంస్థలు ఇబ్బంది పడుతున్నాయి: బీజేపీ ఎమ్మెల్సీ మాధవ్
Advertisement
సీఎం జగన్ వ్యాఖ్యలతో నిర్మాణ సంస్థలు ఇబ్బంది పడుతున్నాయని బీజేపీ ఎమ్మెల్సీ మాధవ్ విమర్శించారు. శాసనసభ మీడియా పాయింట్ వద్ద ఆయన మాట్లాడుతూ, రాజధాని అమరావతి నిర్మాణం తన ప్రాధాన్యత కాదని జగన్ చెప్పటంతో నిర్మాణ సంస్థలు ఇబ్బందులు పడుతున్నాయని, రాష్ట్రంలో భవన నిర్మాణ పనులు నిలిచిపోయాయని అన్నారు. రాష్ట్రానికి వచ్చే పరిశ్రమలు వేరే చోటుకి తరలిపోతున్నాయని, జగన్ ప్రభుత్వం రాజధాని కోసం కొత్త డీపీఆర్ ఇస్తే కేంద్ర ప్రభుత్వం పరిశీలిస్తుందని అన్నారు.

ఇదే సమయంలో గత ప్రభుత్వంపైనా ఆయన విమర్శలు చేశారు. అమరావతి నిర్మాణానికి కేంద్రం ఇచ్చిన నిధులకు సంబంధించిన లెక్కలు చెప్పడంలో గత ప్రభుత్వం విఫలమైందని అన్నారు. ఈ సందర్భంగా విద్యుత్ కొనుగోళ్లకు సంబంధించి గత ప్రభుత్వం చేసుకున్న పవర్ పర్చేజ్ అగ్రిమెంట్ (పీపీఏ)ల అంశం గురించి ప్రస్తావించారు. గత ప్రభుత్వం చేసుకున్న పీపీఏల జోలికి వెళ్లొద్దని కేంద్ర ప్రభుత్వం రాసిన లేఖల గురించి మాధవ్ ప్రస్తావించారు. ఈ లేఖలను రాష్ట్ర ప్రభుత్వం గౌరవించాలని సూచించారు. ఒకసారి ఒప్పందం జరిగిన తర్వాత మళ్లీ వాటి జోలికి వెళ్లడం సరికాదని అన్నారు.

పీపీఏల వల్ల ప్రభుత్వంపై భారం పెరిగిందనుకుంటే, ఒప్పందం కుదుర్చుకున్న ఆయా కంపెనీలతో మళ్లీ మాట్లాడి ఆ భారం తగ్గించుకోవాలని సూచించారు. గత ప్రభుత్వం హయాంలో జరిగిన పనులపై విచారణ జరపాలన్న జగన్ నిర్ణయం రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టే వారికి ఆందోళన కలిగిస్తుందని అభిప్రాయపడ్డారు.
Tue, Jul 16, 2019, 06:30 PM
Advertisement
Advertisement
Copyright © 2019; www.ap7am.com
Privacy Policy | Desktop View