చంద్రబాబు, స్పీకర్ తమ్మినేనిల మధ్య ఆసక్తికర సంభాషణ... నవ్వుల్లో మునిగిపోయిన సభ
Advertisement
ఏపీ అసెంబ్లీ సమావేశాల్లో ప్రతిపక్ష నేత చంద్రబాబు, స్పీకర్ తమ్మినేని సీతారామ్ మధ్య ఆసక్తికర సంభాషణ జరిగింది. చంద్రబాబు మాట్లాడుతూ, సభలో తాము మాట్లాడుతున్నప్పుడు వైసీపీ నేతలు అడ్డుకుంటున్నారని... సభలో తమ వాణిని వినిపించాల్సిన అవసరం లేదా? అని చంద్రబాబు ప్రశ్నించారు. మీరు మమ్మల్ని పట్టించుకుంటారని ఆశిస్తున్నామని... మీరు మాకు మాట్లాడే అవకాశం ఇస్తారని వేలు ఎత్తుకునే ఉంటున్నామని చమత్కరించారు. కానీ, మీ మనసు మాత్రం కరగడం లేదు, మీరు అవకాశం ఇవ్వడం లేదు అధ్యక్షా అని అన్నారు. మీరు మా వైపు చూడటమే మానేస్తున్నారని, ఎందుకో తనకు అర్థం కావడం లేదని చెప్పారు. మావైపు చూస్తే అవతలున్నవారు ఏమనుకుంటారో అని మీరు భయపడుతున్నారేమో అని మేము అనుకుంటున్నామని వ్యాఖ్యానించారు.

దీనికి సమాధానంగా తమ్మినేని కూడా అదే స్థాయిలో చమత్కారంగా స్పందించారు. ఈ రకమైన వ్యాఖ్యలను ఇప్పటికే మీరు రెండోసారో, మూడోసారో అన్నారని చెప్పారు. తాను ఒక విషయాన్ని స్పష్టంగా చెబుతున్నానని... తనను భయపెట్టేవారు ఈ సభలో ఎవరూ లేరని... ఉన్నా తాను భయపడనని అన్నారు. దీనికి కొనసాగింపుగా స్పీకర్ కు చంద్రబాబు ధన్యవాదాలు తెలిపారు. ఇద్దరి మధ్య జరిగిన సంభాషణతో సభ నవ్వుల్లో మునిగిపోయింది.
Tue, Jul 16, 2019, 04:41 PM
Advertisement
Advertisement
Copyright © 2019; www.ap7am.com
Privacy Policy | Desktop View