జగన్.. నీకు కూడా బుద్ధి పెరగాలని కోరుకుంటున్నా!: టీడీపీ నేత అచ్చెన్నాయుడు
Advertisement
Advertisement
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ నిన్న శాసనసభలో అవాస్తవాలు చెప్పి సభను తప్పుదారి పట్టించారని టీడీపీ ఎమ్మెల్యే, సీనియర్ నేత అచ్చెన్నాయుడు విమర్శించారు. ఏపీ అసెంబ్లీ సమావేశాల సందర్భంగా మీడియా పాయింట్ వద్ద టీడీపీ సభ్యులతో కలిసి అచ్చెన్నాయుడు మీడియాతో మాట్లాడుతూ..‘ముందుగా ముఖ్యమంత్రి జగన్ గారికి అవగాహన లేదు. సీనియారిటీ లేదు.

ఈ మధ్య కాలంలో చాలా పేపర్లలో చూశాం. చాలామంది కన్సల్టెంట్లను పెట్టుకుంటున్నట్లు, సీఎం గారు ప్రభుత్వంలో జరుగుతున్న విషయాలు, శాసనసభను ఏ విధంగా జరపాలో తెలుసుకోవాలి’ అని వ్యాఖ్యానించారు. నిన్న అసెంబ్లీ సమావేశాల్లో చర్చను అర్ధంతరంగా ముగించేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

సభలో ఏం జరుగుతుందో సీఎం జగన్ కు అవగాహన లేదని పునరుద్ఘాటించారు. నిన్న శాసనసభలో జరిగిన విషయమై చర్చ జరపాలంటే, సీఎం, ఇతర మంత్రులు దానిపై మాట్లాడకుండా ఆవు కథ చెబుతున్నారని విమర్శించారు. మాట తప్పం మడమ తిప్పం అన్న జగన్, టీడీపీకి ఓ ఛాలెంజ్ చేశారని అచ్చెన్నాయుడు గుర్తుచేశారు.

‘టీడీపీ హయాంలో రైతులకు సున్నా వడ్డీ రుణాలు చిల్లిగవ్వ కూడా ఇవ్వలేదని చెబుతున్నారు. కానీ ఎప్పుడు ఎంత మంజూరు చేశామో లెక్కలు చూపించాం. కానీ చివరికి సీఎం ఈ విషయంలో క్షమాపణలు చెప్పకుండా, ఇష్యూను దారిమళ్లించేందుకు నన్ను, మా నాయకుడిని అవమానించేలా మాట్లాడారు. నా బాడీ పెరిగింది కానీ బుద్ధి పెరగలేదని ఆయన విమర్శించారు. జగన్.. మీరు ముఖ్యమంత్రి అయ్యారు. నీకు కూడా అది పెరగాలని నేను కోరుతున్నాను. నీకు కూడా హుందాతనం ఉండాలనిచెప్పి కోరుతున్నా’ అని అచ్చెన్నాయుడు వ్యాఖ్యానించారు.
Fri, Jul 12, 2019, 12:20 PM
Advertisement
Copyright © 2019; www.ap7am.com
Privacy Policy | Desktop View