ఐటీ దాడులకు భయపడి... బీజేపీలో చేరుతున్న ఏపీ బడాబాబులు!
Advertisement
ఆంధ్రప్రదేశ్ లోని పలువురు బడా వ్యాపారస్తులు ఐటీ దాడులకు భయపడి కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీలో చేరుతున్నారు. ఆగస్టు నెలాఖరు వరకూ బీజేపీ సభ్యత్వ నమోదు కార్యక్రమం కొనసాగనుండగా, సాధ్యమైనంత ఎక్కువ మంది తెలుగుదేశం నేతలను ఆకర్షించాలని బీజేపీ అధిష్ఠానం భావిస్తున్నట్టు తెలుస్తోంది.

ముఖ్యంగా ఉత్తరాంధ్రకు చెందిన బడా వ్యాపారులు బీజేపీలో చేరేందుకు ఆసక్తిని చూపుతున్నారు. ఇప్పటికే రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ ఆధ్వర్యంలో  వైజాగ్ ప్రొఫైల్స్ ఎండీ, టూర్స్ అండ్ ట్రావెల్ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షుడు కాషాయ కండువాను కప్పుకున్నారు.

రాజ్యసభ సభ్యులు సుజనా చౌదరి, సీఎం రమేష్ లు బీజేపీలో చేరిన తరువాత, మరింత మంది వ్యాపారులు బీజేపీవైపు ఆకర్షితులు అవుతున్నారని రాజకీయ పండితులు భావిస్తున్నారు. పలువురు టీడీపీ మాజీ ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్సీలతో పాటు, ఆ పార్టీతో సన్నిహిత సంబంధాలు నడిపిన వ్యాపారులు బీజేపీలో చేరేందుకు సిద్ధంగా ఉన్నట్టు సమాచారం.

అయితే, తాము ఎవరినీ బీజేపీలో చేరాలని కోరడం లేదని, వారంతట వారే తమ పార్టీ విధానాలకు ఆకర్షితులై వస్తున్నారని ఏపీ అసెంబ్లీలో బీజేపీ మాజీ ఫ్లోర్ లీడర్ పి.విష్ణుకుమార్ రాజు వ్యాఖ్యానించారు. ఇదిలావుండగా, టీడీపీ ఏపీ అధ్యక్షుడు కళా వెంకట్రావుకు అత్యంత సన్నిహితుడిగా పేరున్న ఎన్.ఈశ్వరరావు నిన్న తన అనుచరులతో కలిసి బీజేపీలో చేరడం గమనార్హం.
Fri, Jul 12, 2019, 11:38 AM
Advertisement
Advertisement
Copyright © 2019; www.ap7am.com
Privacy Policy | Desktop View