అమానుషం...భార్యాబిడ్డల్ని చంపేసి.. కిరోసిన్‌పోసి నిప్పంటించాడు
వ్యసనాలకు బానిసై ఆస్తికోసం కట్టుకున్న భార్యను, కన్నబిడ్డను అత్యంత కిరాతకంగా హత్యచేశాడో మానవ మృగం. ఇద్దరినీ గొంతు నులిమి చంపేసి అనంతరం కిరోసిన్‌పోసి నిప్పంటించి ఆత్మహత్యగా చిత్రీకరించే ప్రయత్నం చేశాడు. స్థానికుల చొరవతో అతని వ్యూహం బెడిసికొట్టి దారుణం వెలుగుచూసింది. పోలీసుల కథనం మేరకు వివరాల్లోకి వెళితే...సంగారెడ్డి జిల్లా నాగల్‌గిద్ద మండలం కసర్‌గుత్తిలో నిన్న తల్లీకొడుకులపై కిరోసిన్‌పోసి నిప్పంటించి హత్యచేసిన విషయం తెలిసిందే. ఆత్మహత్యగాని లేక పాతకక్షల నేపథ్యంలో ఎవరో గుర్తు తెలియని దుండగులు ఈ ఘోరానికి పాల్పడి ఉంటారని భావించారు. కానీ అసలు నిందితుడు మృతురాలి భర్తేనని తేలింది.

మహారాష్ట్రలోని బెజుల్‌వాడికి చెందిన కవిత(28)కు కసర్‌గుత్తికి చెందిన చింతకి వెంకట్‌రెడ్డితో పదేళ్ల క్రితం పెళ్లయింది. వీరికి దినేష్‌రెడ్డి అనే నాలుగేళ్ల కొడుకు ఉన్నాడు. మద్యానికి బానిసైన వెంకటరెడ్డి తరచూ భార్యతో గొడవపడేవాడు. తమకున్న ఐదెకరాల్లో ఎకరా భూమిని ఇటీవల వెంకట్‌రెడ్డి అమ్మి జల్సాలకు ఖర్చుచేసేశాడు. దీన్ని గమనించిన కవిత ఉన్న నాలుగు ఎకరాలు కూడా భర్త అమ్మేసి దుబారా చేస్తాడన్న భయంతో  పెద్దలను ఆశ్రయించి వారి సాయంతో తన పేరున పట్టా చేయించుకుంది.

ఆ భూమిని సైతం అమ్మేందుకు వెంకట్‌రెడ్డి చేస్తున్న ప్రయత్నాలను కవిత అడ్డుకుంటుండడంతో ఆమెను అంతమొందించాలని నిర్ణయించాడు. బుధవారం మధ్యాహ్నం ఆమె గొంతునులిమి హత్య చేశాడు. దీన్ని కొడుకు గమనించడంతో ఎవరికైనా చెబుతాడన్న భయంతో బిడ్డను కూడా పీకపిసికి చంపేశాడు. అనంతరం ఏమీ తెలియనట్టు ఊర్లో తిరుగుతూ రాత్రికి ఇంటికి వచ్చాడు.

తర్వాత భార్యాబిడ్డలపై కిరోసిన్‌ పోసి నిప్పంటించి వారు ఆత్మహత్యకు పాల్పడ్డారంటూ ఏడవడం ప్రారంభించాడు. అయితే అనుమానం వచ్చిన కొందరు స్థానికులు పోలీసులకు సమాచారం అందించడంతో వారు నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారించడంతో అసలు దారుణం బయటపడింది.
Fri, Jul 12, 2019, 10:02 AM
Advertisement
Advertisement
Copyright © 2020; www.ap7am.com
Privacy Policy | Desktop View