హైదరాబాద్‌లో ఘోరం.. ఇంటర్ విద్యార్థిని ఢీకొట్టి ఈడ్చుకుపోయిన లారీ
Advertisement
హైదరాబాద్‌లో దారుణం జరిగింది. 16 ఏళ్ల ఇంటర్ మొదటి సంవత్సరం విద్యార్థిని ఢీకొట్టిన లారీ అతడిని రెండు కిలోమీటర్లు ఈడ్చుకుపోయింది. ఎర్రగడ్డకు చెందిన ఎం.సాయికృష్ణ బుధవారం తన స్నేహితులతో కలిసి ఓ ఫంక్షన్‌కు హాజరయ్యాడు. గురువారం తెల్లవారుజామున 3.40 గంటల ప్రాంతంలో సాయి తన స్నేహితులతో కలిసి జీవీకే మాల్ మీదుగా ఖైరతాబాద్ వైపు బైక్‌పై వస్తున్నాడు. ఈ క్రమంలో అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్ కాలేజీ సమీపంలోకి రాగానే అదుపు తప్పిన బైక్ కిందపడింది.

అదే సమయంలో వెనక నుంచి వేగంగా వస్తున్న లారీ సాయికృష్ణ పైనుంచి దూసుకెళ్లింది. అదే బైక్‌పై ఉన్న సాయి స్నేహితులు గోగుల ఆదిత్య (17), బి.ప్రశాంత్‌లు స్వల్ప గాయాలతో తప్పించుకున్నారు. ఇక, సాయిని ఈడ్చుకుంటూ వెళ్లిపోయిన లారీ ఖైరతాబాద్ హనుమాన్ టెంపుల్ దగ్గర ఆగగా, దానికి సాయి చిక్కుకుని రక్తమోడుతూ కనిపించాడు. వెంటనే అతడిని ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు లారీ డ్రైవర్ కోసం గాలిస్తున్నారు.
Fri, Jul 12, 2019, 09:15 AM
Advertisement
Advertisement
Copyright © 2019; www.ap7am.com
Privacy Policy | Desktop View