తుపాకితో ఫొటో దిగాలని ఆశ.. శరీరంలోకి దూసుకుపోయిన తూటా
Advertisement
తుపాకితో ఫొటోకు పోజివ్వబోయి ప్రాణం మీదికి తెచ్చుకుందో వివాహిత. ఉత్తరప్రదేశ్‌లోని ఆగ్రాలో జరిగిందీ ఘటన. స్థానిక దుర్గానగర్‌కు చెందిన జాన్వి (23)- విశ్వజిత్ తోమర్‌లు భార్యాభర్తలు. ఏడాది క్రితం వీరికి వివాహమైంది. సైన్యంలో పనిచేసే విశ్వజిత్ తండ్రి సుభాష్‌ను కలిసేందుకు భార్యాభర్తలు ఇద్దరూ కలిసి ఇటీవల ఢిల్లీ వెళ్లారు. ఈ క్రమంలో తన వద్ద ఉన్న లైసెన్స్‌డ్ రివాల్వర్‌ను భద్రంగా దాచిపెట్టాలంటూ సుభాష్ దానిని కోడలికి ఇచ్చాడు.  

తుపాకిని చూసి ముచ్చటపడిన జాన్వి దానితో ఓసారి ఫొటో దిగాలని భావించింది. దానిని పట్టుకుని పోజివ్వగా ఫొటో తీయాలంటూ మేనకోడలు డాలీ(13)ని కోరింది. ఫొటో తీసేందుకు డాలీ సిద్ధమవుతుండగా జాన్వి పొరపాటున తుపాకి ట్రిగ్గర్ నొక్కడంతో బుల్లెట్ ఆమె శరీరంలోకి దూసుకుపోయింది. రక్తపు మడుగులో కుప్పకూలిన ఆమెను వెంటనే సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. బుల్లెట్ జాన్వి గుండె దగ్గరగా వెళ్లడంతో ఆమె ఊపిరితిత్తులు పాడైనట్టు వైద్యులు తెలిపారు. ప్రస్తుతం ఆమె పరిస్థితి విషమంగా ఉందని, కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు.
Fri, Jul 12, 2019, 07:28 AM
Advertisement
Advertisement
Copyright © 2019; www.ap7am.com
Privacy Policy | Desktop View