టీమిండియా సిబ్బందిలో ఒక్కొక్కరినీ సాగనంపుతున్న బీసీసీఐ
Advertisement
టీమిండియా వరల్డ్ కప్ సెమీస్ లో ఓటమిపాలవడంతో జట్టు సహాయక సిబ్బందిపైనా ఆ ప్రభావం పడుతోంది. భారత జట్టు గనుక ఫైనల్ చేరి, కప్ కూడా గెలిస్తే కోచింగ్, సపోర్టింగ్ స్టాఫ్ కు భారీ నజరానాలే కాదు, వారి పదవీకాలం కూడా కచ్చితంగా పొడిగించేవారు. కానీ, న్యూజిలాండ్ చేతిలో ఓడిపోవడంతో పరిస్థితి మారిపోయింది. తొలిగా, టీమిండియా ఫిజియో ప్యాట్రిక్ ఫర్హార్ట్ ను సాగనంపారు.

ఫర్హార్ట్ నాలుగేళ్ల కాలపరిమితి ఈ వరల్డ్ కప్ తో ముగిసింది. మామూలుగా అయితే కాలపరిమితిని పొడిగించే అవకాశం బీసీసీఐ పాలకవర్గానికి ఉంటుంది. కానీ, ఇప్పుడున్న పరిస్థితుల్లో పూర్తిస్థాయిలో మార్పులు చేసేందుకు బోర్డు చర్యలు తీసుకుంటున్నట్టు తెలుస్తోంది. దీనిపై ఫర్హార్ట్ స్పందిస్తూ, టీమిండియాతో తన కాంట్రాక్టు ముగిసిందని, చివరిరోజున తాను కోరుకున్న ఫలితం రాలేదంటూ విచారం వ్యక్తం చేశాడు. నాలుగేళ్లపాటు భారత జట్టుతో కలిసి పనిచేసే అవకాశం ఇచ్చినందుకు బీసీసీఐకి ధన్యవాదాలు తెలిపాడు. భవిష్యత్తులో టీమిండియా మరిన్ని విజయాలు సాధించాలంటూ ఈ ఆస్ట్రేలియా జాతీయుడు ట్వీట్ చేశాడు.

కాగా, టీమిండియాలో మార్పుల పర్వం ఫర్హార్ట్ తో మొదలైందని చెప్పాలి. కోచ్ గా రవిశాస్త్రి పనితీరుపైనా బోర్డు కీలక నిర్ణయం తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. రవిశాస్త్రి కూడా ఇకమీదట కోచ్ గా కొనసాగేందుకు అంగీకరించకపోవచ్చు. 
Thu, Jul 11, 2019, 07:24 PM
Advertisement
Advertisement
Copyright © 2020; www.ap7am.com
Privacy Policy | Desktop View