టీమిండియా ఆరెంజ్ జెర్సీలపై రాజకీయ దుమారం!
Advertisement
ఇంగ్లాండ్ వేదికగా జరుగుతున్న ఐసీసీ క్రికెట్ వరల్డ్ కప్ లో ఆతిథ్య జట్టుతో మ్యాచ్ సందర్భంగా టీమిండియా కాషాయరంగు జెర్సీల్లో బరిలో దిగనున్నట్టు తెలుస్తోంది. ఈ నెల 30న టీమిండియా, ఇంగ్లాండ్ మధ్య లీగ్ మ్యాచ్ జరగనుంది. అయితే, భారత జట్టు ఆరెంజ్ జెర్సీలతో బరిలో దిగనుండడంపై రాజకీయ విమర్శలు మొదలయ్యాయి. ఇది బీజేపీ ఎత్తుగడేనని, దేశం మొత్తాన్ని కాషాయమయం చేసే క్రమంలో క్రికెట్ ఆటగాళ్లకు ఆరెంజ్ జెర్సీలు ఇచ్చారని కాంగ్రెస్, సమాజ్ వాదీ పార్టీ నేతలు మండిపడుతున్నారు.

సాధారణంగా టీమిండియా బ్లూ కలర్ జెర్సీలు వినియోగిస్తుంది. అయితే, శ్రీలంక, ఇంగ్లాండ్ వంటి కొన్ని జట్లు కూడా బ్లూ కలర్ జెర్సీలనే వినియోగిస్తున్నాయి. ఈ జట్ల మధ్య మ్యాచ్ సందర్భంగా ఏదైనా ఒక జట్టు మరో రంగు జెర్సీలతో బరిలో దిగే అవకాశాన్ని ఐసీసీ కల్పిస్తోంది. ఈ క్రమంలో భారత్ ఆరెంజ్ ఎంపిక చేసుకోవడంపై కాంగ్రెస్, సమాజ్ వాదీ పార్టీ విమర్శలు గుప్పిస్తున్నాయి.

ఎన్డీయే ప్రభుత్వం ప్రతిదాన్ని కాషాయీకరణ చేసేందుకు ప్రయత్నిస్తోందని మహారాష్ట్ర మాజీ మంత్రి నసీమ్ ఖాన్ ఆరోపించారు. భారత త్రివర్ణ పతాకంలో మూడు రంగులు ఉన్నప్పుడు కేవలం ఆరెంజ్ కలర్ తీసుకోవడం దేనికి సంకేతం అని సమాజ్ వాదీ పార్టీ నేత అబు అసీమ్ అజ్మీ ప్రశ్నించారు. అయితే, ఈ ఆరోపణలపై బీజేపీ తనదైన శైలిలో స్పందించింది. కాషాయ రంగు ధైర్యానికి, విజయానికి ప్రతీక వంటిదని కేంద్ర మంత్రి రాందాస్ అథవాలే పేర్కొన్నారు. ఈ అంశాన్ని సమస్యలా చూడడం తగదని అన్నారు.
Thu, Jun 27, 2019, 03:41 PM
Advertising
Advertising
Copyright © 2019; www.ap7am.com
Privacy Policy | Desktop View