కృష్ణ-విజయనిర్మల పెళ్లిని ముందే ఊహించిన రాజబాబు!
Advertisement
Advertisement
సినీ రంగంలో కృష్ణ, విజయనిర్మల దంపతులకు ఓ ప్రత్యేకస్థానం ఉంది. ఇద్దరూ ఉన్నతస్థానాలకు ఎదిగినవారే. అటు నటనలో, ఇటు దర్శకత్వంలోనూ మేటిగా నిలిచారు. దాంపత్య పరంగానూ ఈ జోడీ కడవరకు ఎంతో అన్యోన్యంగా మెలిగింది. ఇప్పుడు విజయనిర్మల ఈ లోకాన్ని వీడడంతో కృష్ణ దుఃఖాన్ని ఆపడం ఎవరితరం కావడంలేదు.

అసలు, కృష్ణ, విజయనిర్మల పెళ్లి ఇండస్ట్రీలో ఓ సంచలనం. వీరి పెళ్లినాటికి ఇద్దరూ వివాహితులు. పిల్లలు కూడా ఉన్నారు. అలాంటి వారిద్దరూ వైవాహిక బంధంతో ఒక్కటవుతారన్న విషయం నాటి నటీనటుల ఊహకందని విషయం. కానీ, ప్రముఖ కమెడియన్ రాజబాబు మాత్రం వీరి మధ్య సాన్నిహిత్యాన్ని సరిగ్గానే అంచనావేశారు.

ఒక్కసారి 1967 నాటి ఫ్లాష్ బ్యాక్ లోకి వెళితే... బాపు దర్శకత్వంలో సాక్షి చిత్రం షూటింగ్ తూర్పుగోదావరి జిల్లా ఆత్రేయపురం మండలంలోని పులిదిండి గ్రామం వద్ద జరుగుతోంది. అక్కడి మీసాల కృష్ణుడు ఆలయంలో సెట్స్ వేశారు. ఈ దేవాలయంలో కృష్ణుడికి మీసాలు ఉండడం ప్రత్యేకత. అక్కడ కృష్ణ, విజయనిర్మల కొత్తదంపతుల గెటప్ లో ఉండగా వారిపై సన్నివేశాలు చిత్రీకరిస్తున్నారు. తూర్పు గోదావరికి చెందిన రాజబాబుకి అక్కడి పుణ్యక్షేత్ర స్థలమహాత్మ్యం బాగా తెలుసు.

కృష్ణ, విజయనిర్మల మధ్య ఉన్న బంధాన్ని గుర్తించిన ఆయన "ఇక్కడి మీసాల కృష్ణుడు ఎంతో శక్తిమంతుడైన దేవుడు, ఏది కోరుకుంటే అదే జరుగుతుంది" అంటూ కామెంట్ చేశారు. ఆ సమయంలో కృష్ణ, విజయనిర్మల నవదంపతుల గెటప్ లో ఉన్నారు. ఇది జరిగిన రెండేళ్లకే కృష్ణ, విజయనిర్మల నిజంగానే ఒక్కటయ్యారు. దాంతో, ఇండస్ట్రీ మొత్తం రాజబాబు చెప్పిన జోస్యం గురించే చర్చించుకున్నారు.
Thu, Jun 27, 2019, 02:49 PM
Advertisement
Copyright © 2019; www.ap7am.com
Privacy Policy | Desktop View